ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అసోం(Assam Flood) అతలాకుతలం అవుతోంది. బ్రహ్మపుత్ర(Brahmaputra river) నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. 21 జిల్లాల్లో 3.63 లక్షల మందిపై దీని ప్రభావం పడింది. బార్పేట, మోరిగావ్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు వరద నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. 950 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. 30,300 హెక్టార్లకు పైగా పంట దెబ్బతింది. పలు చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 8 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వారి కోసం అధికారులు 4 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
మూగ జీవాల అవస్థలు..
ప్రసిద్ధ కజిరంగా జాతీయ పార్కులో(Kaziranga National Park) 70 శాతం భూభాగం జలదిగృంధమైంది. అందులోని 223 క్యాంపుల్లో 10 నీట మునిగాయి. దీంతో ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి దున్నలు, దుప్పుల్లాంటి వన్యమృగాలు ప్రాణభయంతో సమీపంలో ఉన్న కాబ్రి పర్వత ప్రాంతంపైకి వెళ్తున్నాయి. ఈక్రమంలో మూడు దుప్పులు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొనడం వల్ల ప్రాణాలు కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నార్త్ బ్యాంకు దారి గుండా వెళాలని సూచించారు. మరోవైపు.. ఈ మార్గంలో వెళ్లేవారికి టైమ్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. గువాహటి సమీపంలోని పొబిటోరా అభయారణ్యం కూడా పాక్షికంగా నీట మునిగినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఊరిపై విరుచుకుపడ్డ కొండ- ముగ్గురు పిల్లలు మృతి