అసోంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు రూ.2,000 ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అసోం ఎన్నికల హామీలను శనివారం గువాహటిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు.
అసోంలో అధికారంలోకి వస్తే ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపింది. అంతేగాక.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. వీటితో పాటు.. టీ తోటల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలను రూ.365 పెంచుతామని స్పష్టం చేసింది.
ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున విడుదల చేసిన మేనిఫెస్టో అయినప్పటికీ.. వాస్తవానికి ప్రజల మేనిఫెస్టో అని రాహుల్ తెలిపారు. అసోం ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తోందన్నారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంపై ఆర్‌ఎస్‌ఎస్, భాజపాలు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దాడులను దేశ భాషలు, చరిత్ర, ఆలోచనలు, జీవన విధానంపై జరిగే దాడులుగా భావించాల్సి ఉంటుందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అసోం మేనిఫెస్టోను విడుదల చేశామని.. ఆ రాష్ట్ర భావాలు, సిద్ధాంతాలను కాంగ్రెస్ సమర్థిస్తుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 'మోదీ హయాంలో వారి సంపదే వృద్ధి'