దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అసోంలోనూ ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ.. భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ బహిరంగసభలో నేతలు, ప్రజల ముందే సీఎం తన స్వహస్తాలతో నిమ్మరసం తయారుచేసుకొని తాగారు.
అసోంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో భబానీపూర్ ఒకటి. ఇక్కడ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫణీందర్ తాలుక్దార్ నిలబడ్డారు. ఆయన నిర్వహిస్తోన్న ఎన్నిక ప్రచార సభలో సీఎం హిమంత బిశ్వా శర్మ కూడా పాల్గొన్నారు. కాగా.. సభవేదిక ఎక్కిన సీఎంకు స్థానిక నేతలు గతి ప్రాంతంలో పండించిన నిమ్మకాయలను ఒక బుట్టలో పెట్టి అందజేశారు.ఇక్కడ పండించే నిమ్మకాయలు మంచి రుచికరమైనవిగా పేరుంది.
అనంతరం సభావేదికపైనే కొన్ని నిమ్మకాయలతో నిమ్మరసం చేసుకొని తాగారు. మిగతా వాటిని ఇంటికి తీసుకెళ్తానని, ఈ రోజు తను పడిన కష్టానికి ప్రతిఫలం ఈ నిమ్మకాయలని చమత్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. భబానీపూర్ అభివృద్ధి కోసం భాజపా అభ్యర్థి ఫణీందర్‌ను గెలిపించాలని కోరారు.
ఇవీ చదవండి: