అసోంలో 47 స్థానాలకు జరగనున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు 173 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. కొన్ని జిల్లాల నుంచి ఇంకా పూర్తి స్థాయి వివరాలు అందాల్సి ఉన్నందున అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
చివరిరోజున వీరే..
నామినేషన్ సమర్పణకు చివరి రోజైన మంగళవారం.. మజులీ నుంచి అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ నామినేషన్ దాఖలు చేశారు. పలువురు భాజపా, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నామినేషన్ సమర్పించారు. దులియాజన్, నహర్కటియా నుంచి అసోం జాతీయ పరిషత్ అధ్యక్షుడు లురిన్జ్యోతి గొగోయి పోటీ చేయనున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న రైజోర్ దళ్ నాయకుడు అఖిల్ గొగోయి కూడా అసోం మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరియాని, సిబ్సాగర్ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ సమర్పించారు.
మార్చి 10న ఈ నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. అభ్యర్థులు మార్చి 12లోగా తమ నామినేషన్ను ఉపసంహరించుకోవచ్చు. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి:'విదేశాంగ వ్యూహం'తో అసోంపై భాజపా గురి!