జమ్ముకశ్మీర్‌లో ఆసియాలోనే అతిపెద్ద అల్ట్రా సైకిల్ రేసింగ్ ప్రారంభమైంది. మార్చి1న రాజధాని శ్రీనగర్‌లో ఈ రేసును ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహిస్తున్న అల్ట్రా సైకిల్ రేస్‌ను శ్రీనగర్‌లోని బక్షి స్టేడియం నుంచి డివిజనల్ కమిషనర్ (కశ్మీర్) విజయ్ కుమార్ భిదూరి ప్రారంభించారు. సైకిల్ రేసింగ్‌ను అమెరికాకు చెందిన వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ అసోసియేషన్ గుర్తించింది. అలాగే ఆసియా అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్, ప్రపంచ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌గా ప్రకటించిందని అధికారులు తెలిపారు. ఈ సైకిల్ రేస్‌లో పాల్గొనేవారు వరుసగా 12, 10, 8 రోజుల కటాఫ్ సమయంతో.. సోలో, 2 టీమ్, 4 టీమ్‌లో పెడ్లింగ్ చేయాలి.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,651 కి.మీ దూరం రేసర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కశ్మీర్లో ప్రారంభమైన రేసింగ్ తమిళనాడులోని కన్యాకుమారిలో ముగుస్తుంది. సైకిల్ రేస్ 12 రాష్ట్రాలు, మూడు మహానగరాలు, 20కి పైగా నగరాల మీదుగా వెళుతుంది. ఈ కార్యక్రమాన్ని సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు భద్రతా, సహాయ బృందాలతో సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
![Asia's longest cycle race from Kashmir to Kanyakumari flagged off from Srinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17885500_cycle.jpg)
![Asia's longest cycle race from Kashmir to Kanyakumari flagged off from Srinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17885500_ccyclle.jpg)
రేసింగ్ బృందాల్లో మహా సైక్లింగ్ స్క్వాడ్, మహారాష్ట్ర పోలీస్, ఏడీసీఏ, అమరావతి రైడర్స్ ఉన్నాయి. "అల్ట్రా సైకిల్ రేస్ అనేది రైడర్ల ఓర్పును, ఆసక్తిని తెలియజేస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే తపనకు క్రీడలు ప్రతీక. కశ్మీర్‌లోని ప్రతి ప్రాంతానికి క్రీడా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని రేస్‌ను ప్రారంభించిన అనంతరం విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
![Asia's longest cycle race from Kashmir to Kanyakumari flagged off from Srinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17885500_ccycle.jpg)
![Asia's longest cycle race from Kashmir to Kanyakumari flagged off from Srinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17885500_ccycldfe.jpg)
సోలో రైడర్లు డాక్టర్ అమృత్ సమర్థ్, సాహిల్ సచ్‌దేవా, సుమేర్ బన్సల్, ధీరజ్ కల్సైత్, శుభమ్ దాస్, మహేష్ కిని, అతుల్ కడు, విక్రమ్ ఉనియాల్, మనీష్ సైనీ, ఇంద్రజీత్ వర్ధన్, గీతా రావు, 'అమీబా' రవీంద్రారెడ్డి ఈ రేసులో పాల్గొంటున్నారు. రేసును పూర్తి చేయడానికి రైడర్‌లకు.. సిబ్బంది, సహాయక వాహనాలు తోడుగా ఉంటాయి. ప్రతిష్టాత్మకమైన సైకిల్ రేస్ భారత్‌లో నిర్వహించడం ఇదే ప్రథమమని రేస్ అక్రాస్ ఇండియా (ఆర్ఏఐఎన్) ప్రాజెక్ట్ డైరెక్టర్ జితేంద్ర నాయక్ తెలిపారు. రేస్ సురక్షితంగా, ఎలాంటి చీటింగ్ జరగకుండా ఉండేందుకు 100 మంది అధికారుల బృందాన్ని నియమించామని తెలిపారు. సైకిల్ ర్యాలీని ప్రారంభించిన సమయంలో ఇతర సివిల్, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
![Asia's longest cycle race from Kashmir to Kanyakumari flagged off from Srinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17885500_ccyclgdfe.jpg)