Ashok Gehlot vs Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఏర్పడిన వర్గ పోరును ఆపేందుకు ఆ పార్టీ అధిష్ఠానం నడుం బిగించింది. గత కొన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అగ్రనేత సచిన్ పైలట్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నష్టపోకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతోంది. ఈ మేరకు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌కు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వీరిద్దరితో విడివిడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ అగ్రనేతలు కూడా పాల్గొంటారని పేర్కొన్నాయి. ఇరు వర్గాల ఫిర్యాదులను, వాదనలను ఓపికతో వింటానని ఖర్గే మాట ఇచ్చినట్లు సమాచారం. కాగా.. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ దిల్లీ పర్యటనను ధ్రువీకరిస్తూ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల నియామక పరీక్ష పత్రాల లీకేజీ అంశాలపై 15 రోజుల్లోగా చర్యలు చేపట్టకపోతే తన ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తానని సచిన్ పైలట్ ఇటీవల సొంత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని.. కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. మే 26న రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం వాయిదా పడింది. దీంతో వర్గ పోరు మరింత ముదరకముందే సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్‌తో.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడివిడిగా భేటీ అవుతున్నారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అశోక్ గహ్లోత్, పైలట్‌ను ఏకతాటిపైకి తీసుకురావడానికి మల్లికార్జున ఖర్గే ఇరువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఖర్గే విజయం సాధించారని పేర్కొన్నాయి. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చి సంక్షోభానికి అడ్డుకట్ట వేయాలని ఖర్గే భావిస్తున్నారని వెల్లడించాయి.
మీ నాయకురాలు సోనియా గాంధీనా?.. వసుంధర రాజేనా?..
Sachin Pilot On Ashok Gehlot : 2020లో సచిన్ పైలట్ నేతృత్వంలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు తన ప్రభుత్వం కూలిపోకుండా వసుంధర రాజే ఆదుకున్నారని మే 7న ధోల్‌పుర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం అశోక్ గహ్లోత్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సచిన్ పైలట్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గహ్లోత్ నాయకురాలు సోనియాగాంధీనా? లేక వసుంధర రాజేనా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై పొగడ్తలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి.. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలనే అవమానిస్తున్నారని పైలట్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే చర్యలను తాము ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అలాగే అవినీతికి వ్యతిరేకంగా మే 11 నుంచి ఐదు రోజులు అజ్మేర్ నుంచి జయపురకు జన సంఘర్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.