Ashish Mishra surrender: ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటన ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్ర కోర్టులో లొంగిపోయారు. ఆశిష్‌కు.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఆయన లఖింపుర్ జిల్లా కోర్టుకు వెళ్లి సరెండర్ అయ్యారు. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆశిష్‌ను సుప్రీంకోర్టు ఆదేశించగా.. ఒక రోజు మిగిలి ఉండగానే ఆయన ధర్మాసనం ఎదుట సరెండర్ అయ్యారు. నిందితుడు ఆశిష్ మిశ్రాకు భద్రతా కారణాల వల్ల జైలులో ప్రత్యేక గదిని కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు.
గత సోమవారం ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. దానిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. వారంలోగా లొంగిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా- బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారుతో నలుగురు రైతులను ఢీకొట్టారు. ఈ ఘటనలో జరిగిన హింసతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్ర ప్రధాన నిందితుడుగా ఉన్నారు.
ఇదీ చదవండి: 'నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు'