Article 370 Supreme Court Judgement : కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్370 రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక అధికరణం మాత్రమేనని స్పష్టం చేసింది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
-
VIDEO | "We have held that Article 370 is a temporary provision," says Chief Justice of India DY Chandrachud as five-judge SC bench delivers verdict on pleas challenging abrogation of Article 370 from Jammu and Kashmir. pic.twitter.com/UeSgru1o3e
— Press Trust of India (@PTI_News) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "We have held that Article 370 is a temporary provision," says Chief Justice of India DY Chandrachud as five-judge SC bench delivers verdict on pleas challenging abrogation of Article 370 from Jammu and Kashmir. pic.twitter.com/UeSgru1o3e
— Press Trust of India (@PTI_News) December 11, 2023VIDEO | "We have held that Article 370 is a temporary provision," says Chief Justice of India DY Chandrachud as five-judge SC bench delivers verdict on pleas challenging abrogation of Article 370 from Jammu and Kashmir. pic.twitter.com/UeSgru1o3e
— Press Trust of India (@PTI_News) December 11, 2023
"భారత్‌లో విలీనం తర్వాత జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు. తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370 పెట్టారు. యుద్ధ పరిస్థితుల వల్లే ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, యూటీలతో జమ్ము కశ్మీర్ సమానమే. ఆర్టికల్స్ 1, 370 ప్రకారం జమ్ము కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే. భారత రాజ్యాంగానికి సంబంధించిన అన్ని నిబంధనలు జమ్ము కశ్మీర్‌కు వర్తిస్తాయి. 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయి."
-జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. 2024 సెప్టెంబర్ 30 లోగా జమ్ము కశ్మీర్‌కు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి స్పష్టం చేసింది. మరోవైపు, జమ్ము కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయాన్ని సైతం సమర్థిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ కౌల్ ఏమన్నారంటే?
న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా రద్దును సమర్థించినప్పటికీ మూడు వేర్వేరు తీర్పులు వెలువరించారు. తనతో పాటు జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ తరఫున సీజేఐ తీర్పు చెప్పారు. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా వేర్వేరు తీర్పులు వెలువరించారు. సీజేఐ వివరణతో ఏకీభవిస్తూనే భిన్నమైన కారణాలు పేర్కొంటూ తీర్పు రాశారు జస్టిస్ ఎస్కే కౌల్. ఆర్టికల్ 370 ఉద్దేశం జమ్ము కశ్మీర్‌ను క్రమంగా ఇతర రాష్ట్రాల స్థాయికి తీసుకురావడమేనని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ అనుమతి అవసరమన్న విషయాన్ని విస్తృత కోణంలో చూడలేమని అన్నారు. మరోవైపు, జమ్ము కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలపై దర్యాప్తు కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం సీజేఐ తీర్పును సమర్థిస్తూనే అందుకు తన కోణంలో కారణాలు చెప్పారు.
కేంద్రం వాదనలివే!
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 16 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్-370 రద్దును సమర్థిస్తూ వాదనలు వినిపించింది. ప్రత్యేక హోదా రద్దు విషయంలో ఎలాంటి రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు జరగలేదని పేర్కొంది. విలీన ఒప్పందం ద్వారా భారత్‌లో జమ్ము కశ్మీర్ అంతర్భాగమైందని, స్వాతంత్ర్యం తర్వాత అనేక చిన్న రాజ్యాలు దేశంలో ఇలాగే కలిశాయని కోర్టుకు విన్నవించింది. అయితే, విలీనం తర్వాత వాటి సార్వభౌమాధికారం పూర్తిగా భారత్‌లో అంతర్భాగమైనట్లు వివరించింది. జమ్ము కశ్మీర్‌కు ప్రస్తుతం కల్పించిన కేంద్రపాలిత ప్రాంత హోదా తాత్కాలికమని, భవిష్యత్‌లో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. లద్దాఖ్ మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతుందని పేర్కొంది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
పిటిషనర్లు ఏమన్నారంటే?
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆర్టికల్ 370 తాత్కాలికం కాదని, జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ రద్దు తర్వాత అది శాశ్వతత్వం పొందిందని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదించారు. ఆర్టికల్ 370 రద్దును పార్లమెంట్ చేపట్టలేదని అన్నారు. జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ ప్రతిపాదించకుండా ఈ ఆర్టికల్‌ను రద్దు చేయలేరని అన్నారు. విలీనం సందర్భంగా జమ్ము కశ్మీర్ విదేశాంగ, రక్షణ, సమాచారానికి సంబంధించిన అధికారాలను మాత్రమే అప్పటి మహరాజు భారత్‌కు అప్పగించారని జమ్ము కశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాదించింది. పరిపాలన, చట్టాల రూపకల్పన వంటి అధికారాలను రాష్ట్రానికే అప్పగించినట్లు తెలిపింది.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది.
కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం- నెటిజన్లకు పోలీసుల సూచన
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. లోయలో అదనపు బలగాలను మోహరించారు. శ్రీనగర్ సహా అనేక ప్రాంతాల్లో చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వచ్చే పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే, ప్రజల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని యూజర్లకు సూచించారు కశ్మీర్ సైబర్ పోలీసులు. దుష్ప్రచారాలు, విద్వేష ప్రసంగాలను షేర్ చేయవద్దని కోరారు. హింసను ప్రేరేపించే విధంగా ఉన్న కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దని స్పష్టం చేశారు.
ముఫ్తీ గృహనిర్బంధం?
మరోవైపు, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఫ్తీ ఇంటి తలుపులకు తాళం వేశారని, అక్రమంగా గృహనిర్బంధం చేశారని పీడీపీ ఎక్స్‌లో వెల్లడించింది. అయితే, ఈ వార్తలన్నీ అవాస్తవమని, రాజకీయ కారణాలతో ఎవరినీ గృహనిర్బంధం చేయలేదని జమ్ము కశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు.
మరోవైపు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా నివాసాల వద్దకు వెళ్లేందుకు జర్నలిస్టులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు.