పార్లమెంటు సమవేశాల నేపథ్యంలో రైతు సంఘాలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం నిరసన చేపట్టాయి. బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ ఆధ్వర్యంలో రైతు నేతలు ఆందోళనలు నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా నుంచి 200 మంది.. కిసాన్ సంఘర్ష్ కమిటీ నుంచి ఆరుగురు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా సింఘూ సరిహద్దు నుంచి ప్రత్యేక బస్సుల్లో రైతులు జంతర్‌మంతర్ చేరుకున్నారు.
రైతు నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్, అకాలీదళ్‌కు చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.
రైతు నేతల నిరసనలకు దిల్లీ పోలీసులు.. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు అనుమతించారు. గురువారం మొదలుకొని పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు రైతు నేతలు ప్రతిరోజు ఈ నిరసనలు కొనసాగిస్తారు.