Are 5 year olds free on trains : ఐదేళ్లలోపు పిల్లలకు రైలులో ప్రయాణం ఉచితం కాదా? పెద్దలతో సమానంగా ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందేనా? కొద్దిరోజులుగా చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై బుధవారం స్పష్టత ఇచ్చింది భారతీయ రైల్వే. చిన్న పిల్లలకు టికెట్ బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తేల్చిచెప్పింది. నాలుగేళ్లలోపు పిల్లలకూ ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందేనన్న వార్తలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
Train ticket for 5 year old : రైల్వే మంత్రిత్వ శాఖ 2020 మార్చి 6న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఐదేళ్లలోపు చిన్నారులకు రైలులో ప్రయాణం ఉచితం. అయితే.. ఇదే సర్కులర్లో ఓ ప్రత్యేక నిబంధనను పొందుపరిచింది ఆ శాఖ. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రత్యేకంగా బెర్త్ లేదా సీటు కావాలంటే.. ఫుల్ ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాలన్నది దాని సారాంశం. ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని బుధవారం స్పష్టత ఇచ్చింది భారతీయ రైల్వే.
"ఈ వార్తా కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. పిల్లల ప్రయాణానికి సంబంధించిన నిబంధనల్లో రైల్వే శాఖ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రయాణికుల డిమాండ్ మేరకే ఐదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక బెర్త్ లేదా సీటు కావాలంటే ఫుల్ టికెట్ తీసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించింది. వారికి ప్రత్యేక బెర్త్ అవసరం లేదనుకుంటే.. ప్రయాణం ఉచితమే." అని స్పష్టం చేసింది భారతీయ రైల్వే.
నాలుగేళ్లలోపు పిల్లలకూ ఫుల్ టికెట్ తప్పనిసరి అంటూ ఇటీవల వార్తలు రాగా.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. "రైలులో ప్రయాణించేందుకు ఏడాది పిల్లల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తున్న భాజపా ప్రభుత్వం.. గర్భవతులను ఎక్స్ట్రా టికెట్ అడగనందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి. భారతీయ రైల్వే.. పేదల కోసం పనిచేయడం లేదు. ప్రజలు భాజపాకు ఫుల్ టికెట్ కొడతారు" అని ట్వీట్ చేశారు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్.