AP MLC Sheikh Sabji Died in Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలం వద్ద, ఈయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ ప్రాణాలు కోల్పోగా, ఆయన పీఏ, గన్‌మెన్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
సమ్మెలో పాల్గొనడానికి వెళ్తుండగా ప్రమాదం : భీమవరంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకు ఏలూరు నుంచి ఎమ్మెల్సీ కారులో బయల్దేరారు. అయితే కారు ఏలూరు నుంచి వస్తున్న క్రమంలో చెరుకువాడ వద్దకు రాగానే, భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వీరి కారును ఎదురుగా ఢీకొట్టింది.
ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన డ్రైవర్, గన్‌మెన్, ఆయన పీఏ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.
మహిళను ఢీకొట్టిన బస్సు- అక్కడికక్కడే మృతి- సీసీటీవీలో లైవ్ వీడియో
తండ్రి, తాత ఇద్దరూ ఉపాధ్యాయులే : ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1966లో జన్మించారు. షేక్ కబీర్షా, షేక్ సైదాబాబి తల్లిదండ్రులు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సాబ్జీ పని చేశారు. ఏలూరు మండంలంలోని మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సమయంలోనే, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. అప్పటికి ఆయన సర్వీసు ఇంకా 5 సంవత్సరాలు మిగిలే ఉంది. ఈయన తండ్రి, తాత ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే పని చేశారు. 2019లో సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు - విజయవాడ పాదయాత్రకు నాయకత్వం వహించారు.
మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆకస్మిక మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గం సమావేశం జరగగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం- ఆరుగురు పోలీసులు మృతి
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత : పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సాబ్జీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాబ్జీ చివరి ఘడియల్లోనూ ప్రజాసేవలోనే గడిపారని చంద్రబాబు అన్నారు.
సంతాపం ప్రకటించిన నారా లోకేశ్: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారనే విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. శాసనమండలిలోని ప్రజల గొంతు మూగబోయిందని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మృతిపై లోకేశ్ నివాళులు అర్పించారు. సాబ్జీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
Karnataka Accident Today: లారీని ఢీకొన్న టాటా సుమో.. 13 మంది ఏపీ వాసులు మృతి