Chandrababu Bail Petition: అమరావతి రింగ్ రోడ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ... తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది . చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూత్ర వర్చువల్ గా వాదనలు వినిపించారు . ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు . ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పు రిజర్వ్ లో ఉంచింది. అమరావతి రింగ్ రోడ్ ప్రాజెక్ట్ లో ఒక్క అడుగు భూమి కూడా సేకరించలేదని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్ద్ వాదనలు వినిపించారు .
అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందడం, ఇతరులకు నష్టం జరగడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ప్రతీకార ఎజెండాతో ముఖ్యమంత్రి.. రాజకీయ ప్రత్యర్ధులపై తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారన్నారు. 2022 మే 09న సీఐడీ కేసు నమోదు చేసినప్పటికి దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు తనకు నోటీసు ఇవ్వడం లేదా విచారించడం చేయలేదన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఇదే కేసులో ఇతర నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిలు ఇస్తూ 2022 సెప్టెంబరు 6న ఉత్తర్వులు జారీచేసిందన్నారు. లింగమనేని రమేష్ కు కేవలం ఇంటి అద్దె మాత్రమే చెల్లించారని వాదించారు. తన వాదనలను పరిగణలోకి తీసుకుని బెయిల్ ను మంజూరు చేయాలని కోరారు.