AP High Court on Capital Shift to Visakhapatnam : ఏపీలో అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ యు. దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో సాగర నగరానికి కార్యాలయాలను తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్‌పై శుక్రవారం జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలను వినిపించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నామన్న ఉద్దేశంతో సింగిల్ జడ్జి స్టే ఇచ్చారన్న ఆయన నిజానికి కార్యాలయాలను తరలించట్లేదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పనుల సమీక్ష కోసం సీఎం క్యాంప్ కార్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని సమీక్ష నిమిత్తం హాజరయ్యే అధికారులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నామని కోర్టుకు చెప్పారు.
AP High Court Refuses Single Judge Order for Capital Shift to Visakha : అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నామని పిటిషనర్లు తప్పుగా అర్థం చేసుకొని వ్యాజ్యాలు దాఖలు చేశారన్న ఏజీ సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుపై గతంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడే విచారణ జరపాలని సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు.
అమరావతి రాజధాని పిటిషన్ల విచారణ - ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
రాజధాని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపినా, సింగిల్ జడ్జి వద్దకు పంపినా అభ్యంతరం లేదన్నారు. ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఎంతమంది ప్రభుత్వోద్యోగులను విశాఖకు తీసుకెళుతున్నారు? అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారనే వివరాల పట్టికను ఇవ్వాలని ఆదేశించింది. అమరావతి నుంచి కార్యాలయాలను తరలించొద్దని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉద్దేశం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం విశాఖలో కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో అక్కడికి కార్యాలయాలను తరలిస్తున్నారన్న భావనతో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడింది.
రాజధానిగా అమరావతే- 3నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తా: చంద్రబాబు
త్రిసభ్య ధర్మాసనం తీర్పు అడ్డుగా ఉండటంతో క్యాంపు కార్యాలయ ముసుగులో పరోక్షంగా ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలన్న వాదనను అంగీకరిస్తూనే మరోవైపు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోందని వివరించింది. ఈ నేపథ్యంలో ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులిచ్చినా అవి అభ్యంతరకరమని ప్రభుత్వం భావించే అవకాశం ఉందన్న ధర్మాసనం వ్యాజ్యాలను తామే త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపితే ఆ ధర్మాసనమే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించాలా? ఎత్తేయాలా? అలాగే కొనసాగించాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తుందని స్పష్టంచేసింది. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. వ్యాజ్యాలపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది.
ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికిప్పుడే తరలించడం లేదు - హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది