పంజాబ్ రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతూ ఆసక్తి రెకెత్తిస్తున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్షుడి ఎంపికపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వరం మార్చారు. పీపీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ నియామకానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన అమరీందర్.. రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్‌తో సమావేశం అనంతరం వెనక్కి తగ్గారు. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
" హరీశ్ రావత్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ ఆమోదయోగ్యమే."
- రావీన్ థుక్రాల్, సీఎం మీడియా సలహాదారు.
సిద్ధూ, అమరిందర్ సింగ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన క్రమంలో.. ఛండీగఢ్‌కు వెళ్లిన రావత్.. నేరుగా మొహాలిలోని ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌కు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. సోనియాకు రాసిన లేఖపై ఆరా తీసిన రావత్.. అమరీందర్‌ను శాంతింపజేశారు. ఆ తర్వాత.. ' కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానిని గౌరవిస్తామని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పునరుద్ఘాటించారు,' అని పేర్కొన్నారు రావత్.
నేడే ప్రకటన..!
పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడిందని, శనివారం సాయంత్రంలోపు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సోనియా అధికారిక నివాసంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా, మరో నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
సిద్ధూ వరుస భేటీలు..
ముఖ్యమంత్రితో హరీశ్ రావత్ భేటీకి ముందే.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జఖర్‌తో పంచకులలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు సిద్ధూ. సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. జఖర్ తన పెద్ద అన్న అని, మార్గనిర్దేశకుడిగా పేర్కొన్నారు సిద్ధూ. సిద్ధూని సమర్థుడిగా అభివర్ణించారు జఖర్.
అంతకు ముందు పార్టీ నేత లాల్ సింగ్, రాష్ట్ర మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధవలతో సమావేశమయ్యారు సిద్ధూ. అధ్యక్ష పదవి సహా ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. పార్టీలో పరిస్థితులు అంతా సరిగానే ఉన్నాయని, నేతలు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమావేసమవుతూ పార్టీ అభివృద్ధి కోసం చర్చించాలని కోరారు మంత్రి రంధవ.
కీలక పదవులపై ఊహాగానాలు..
నవజ్యోత్ సిద్ధూని పీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే.. ఇద్దరు జాట్ సిక్కులకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. కెప్టెన్ కూడా జాట్ సిక్కు వర్గానికి చెందినవారే. ప్రస్తుత అధ్యక్షుడు జఖర్ హిందూ వర్గానికి చెందినవారు. మరోవైపు.. దళిత, హిందూ వర్గాల నుంచి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించటం ద్వారా సమతూకంగా ఉంటుందనే వాదనలు ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సిద్ధూకే అధ్యక్ష పదవి ఇస్తారనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఆయన మద్దతుదారులు. ఈ క్రమంలోనే సంబరాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: సోనియాకు పంజాబ్ సీఎం ఘాటు లేఖ