భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటి నుంచీ యాంటీబాడీ టెస్టులు బాగా ప్రాచుర్యం పొందాయి. చాలా మంది తమకు కొవిడ్ సోకిందా లేదా తెలుసుకోవడానికి ఇది సరైన మార్గంగా భావిస్తున్నారు. లేదా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ శరీరంలోని రోగనిరోధక శక్తిని స్థాయిలను తెలుసుకొనేందుకు ఈ పరీక్షలను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ల్యాబ్‌లు యాంటీబాడీ టెస్టులను కరోనా నుంచి రక్షణ పొందే స్థాయిలను చెబుతాయంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ అవి నిజం కాదు.
అసలు యాంటీబాడీ పరీక్షలు ఎందుకంటే?
మార్కెట్లో ప్రస్తుతం కొన్ని ల్యాబ్‌లు ప్రచారం చేసుకుంటున్నట్లు యాంటీబాడీ టెస్టు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో కరోనా వస్తుందో రాదో చెప్పలేం. ఈ పరీక్ష కేవలం మీకు గతంలో కరోనా వచ్చిందా అని తెలుసుకోవడానికి, వ్యాక్సిన్ మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాలను తెలుకోవడానికి ఉపయోగపడుతుంది. అమెరికాలోని సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం యాంటీబాడీ టెస్టులు కేవలం ఎపిడిమియోలాజికల్, సెరోలాజికల్ వివరాల కోసం మాత్రమే వాడతారు. అంతే కానీ మన రక్షణ సామర్థ్యం, వ్యాధిని తెలుసుకోవడానికి కాదు.
ఇదెలా పనిచేస్తుందంటే..
ఏదైనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించినపుడు ఐజీఎం అనే యాంటీబాడీలు మొదటి వారంలో ఉత్పత్తి అవుతాయి. తర్వాత మూడు వారాలకు గరిష్ఠస్థాయికి చేరుకుంటాయి. తర్వాత అవి క్షీణించడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఐజీజీ ప్రతిరోధకాలు ఉత్పత్తవుతాయి. ఇవి శరీరంలో రక్షణకు తోడ్పడతాయి. ఇవి వైరస్ నుంచి శరీరాన్ని రక్షించడం కన్నా వాటిని తటస్ఠం చేసేందుకు ఉపయోగపడతాయి. యాంటీబాడీ పరీక్షల్లో ఐజీఎం, ఐజీజీ ప్రతిరోధకాలు ఎంత శాతం ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. టీకాలు వేసిన తర్వాత రోగనిరోధక శక్తి మార్పులను వెల్లడిస్తాయి. వీటిని ఎక్కువగా సెరో సర్వేలు చేసేందుకు వినియోగిస్తారు.
వీటిలో ఎన్ని రకాలున్నాయంటే..
యాంటీబాడీ టెస్టుల్లో అనేక రకాలున్నాయి. అవి రాపిడ్ డయాగ్నోస్టిక్‌టెస్ట్ (ఆర్‌డీటీ), ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో అబ్జార్బెంట్ అసేస్ (ఈఎల్‌ఐఎస్‌ఏ), న్యూట్రలైజేషన్ అసేస్,కెమిలుమినిసెంట్ ఇమ్యునోఅసేస్. వీటిలో రాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ప్రస్తుతం ఎక్కువగా వాడుకలో ఉంది.
ఇదీ చదవండి : 'రాష్ట్రాలు, యూటీల వద్ద 1.94 కోట్ల టీకాలు'