ఒడిశాలో ఇటీవల ఇద్దరు రష్యా ప్రముఖులు చనిపోయిన విషయం మరవకముందే.. మరో రష్యన్ మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. పారాదీప్ పోర్టులో లంగరు వేసి ఉన్న షిప్లో అతడి మృతదేహం లభ్యమైంది. తాజాగా చనిపోయిన వ్యక్తిని మిల్యాకోవ్ సెర్గీ(51)గా పోలీసులు గుర్తించారు. ఎమ్బీ అల్ద్నాఅనే నౌకకు ఆయన ఛీప్ ఇంజనీర్ అని తెలుస్తోంది. ఈ నౌక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ పోర్టు మీదుగా ముంబయి వెళ్తోందని సమాచారం. మంగళవారం ఉదయం నౌకలోని చాంబర్లో ఆయన విగతజీవిగా పడి ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఇంజినీర్ మరణాన్ని పారాదీప్ పోర్టు ట్రస్టు ఛైర్మన్ పీఎల్ హరనంద్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే, 15 రోజుల వ్యవధిలో ముగ్గురు రష్యా పౌరులు చనిపోవడం దుమారం రేపుతోంది.
పక్షం రోజుల్లో ముగ్గురు..
గతేడాది డిసెంబర్లో ఇద్దరు రష్యా టూరిస్టులు ఒడిశాలో అనుమాదాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. పావెల్ ఆంటోవ్ అనే రష్యాకు చెందిన చట్టసభ్యుడుతి.. హోటల్ మూడో ఫ్లోర్ నుంచి పడిపోయి మరణించారు. డిసెంబర్ 24న మరో రష్యా పౌరుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61).. తన హోటల్ గదిలో అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించాడు. ఈ రెండు కేసుల్లో ఒడిశా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉండగా.. వీరిద్దరి అసహజ మరణాలపై నాలుగు రోజులుగా క్రైంబ్రాంచ్ చేపడుతున్న విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. వీరిద్దరి పోస్టుమార్టం నివేదికను ఆధారంగా చేసుకొని క్రైంబ్రాంచ్ అధికారులు మరో కొత్తకోణంలో దర్యాప్తు చేపట్టారు. బిదెనోవ్ మృతదేహంలో గంజాయి వాసనతో కూడిన 100 మి.లీ. ద్రవ పదార్థం ఉన్నట్లు శవపరీక్ష నివేదిక పేర్కొంది. దీంతో ఆ దిశగా అధికారులు విచారణను వేగవంతం చేస్తున్నారు. హోటల్‌లో బస చేసిన రష్యా టూరిస్టులకు గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? అన్న కోణంలో హోటల్ సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు.
నాలుగు వారాల్లో సమర్పించాలి..
రష్యా ప్రముఖుల మరణాలకు సంబంధించి పోలీసు యంత్రాంగం తీసుకున్న కార్యాచరణ నివేదికను సమర్పించాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. రష్యా ప్రముఖుల మృతికి సంబంధించి బ్రహ్మపురానికి చెందిన రబీంద్ర మిశ్ర అనే మానవ హక్కుల కార్యకర్త కమిషన్‌ను ఆశ్రయించడంతో దీనిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ నివేకానందశర్మను ఎన్‌హెచ్‌ఆర్సీ కోరింది.
విచారణ వేగవంతం..
డీఎస్పీ సరోజ్‌కాంత్ మొహంతో నేతృత్వంలో పన్నెండు మందితో కూడిన క్రైంబ్రాంచ్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సరోజ్‌కాంత్, ఇన్‌స్పెక్టర్ మమతారాణి పండాతో కూడిన అధికారుల బృందం హోటల్‌లో మేనేజ్‌మెంట్, సిబ్బందిని విచారిస్తుండగా, వైద్య సంబంధిత, ఇతరత్రా విచారణలో మరికొంత మంది నిమగ్నమైనట్లు సమాచారం.
హోటల్ ఎండీ అరబింద సాహు, మేనేజర్ కౌషిక్ టక్కర్, ముగ్గురు రిసెప్షనిస్టులు, సూపర్‌వైజర్, రెస్టారెంట్ కెప్టెన్, రూం అటెండెంట్ తదితర ఇరవై మందికిపైగా సిబ్బందిని వేర్వేరుగా వీడియోగ్రఫీ ద్వారా అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. దీనిపై హోటల్ ఎండీ అరబింద మాట్లాడుతూ అధికారుల విచారణకు తమ సిబ్బంది అంతా సహకరిస్తున్నారని చెప్పారు. వారు అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెబుతున్నట్లు పేర్కొన్న ఆయన అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారన్న మాటలకు సమాధానాన్ని దాటవేశారు. డిసెంబర్ ఒకటి నుంచి 27 వరకు హోటల్‌లో బస చేసిన వారి వివరాలను సేకరించిన అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు.