తాను మళ్లీ నిరాహార దీక్ష చేపడతానని కేంద్రాన్ని హెచ్చరించారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. వ్యవసాయ రంగంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు సహా తన డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో తాను తిరిగి నిరాహార దీక్ష మొదలుపెడతానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు హజారే.
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక రూపొందిస్తుందని.. 2019లో నాటి వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఇచ్చిన హామీ పత్రాన్ని.. ఈ లేఖలో జోడించారు హజారే. వ్యవసాయ ధరల కమిషన్‌కు(సీఏసీపీ) స్వతంత్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
"కమిటీ నివేదిక ఆధారంగా నా డిమాండ్లపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఎటువంటి పురోగతి లేదు. అందుకే, 2019 ఫిబ్రవరి 5న విరమించుకున్న నిరాహార దీక్షను తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నాను," అని తోమర్‌కు రాసిన లేఖలో హజారే పేర్కొన్నారు. దీక్ష చేపట్టే తేదీ, ప్రదేశాన్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
ఇదీ చూడండి: రైతన్నకు మద్దతుగా హజారే నిరాహార దీక్ష