Anna Hazare Hunger Strike: ఇకపై సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్లలోనూ మద్యం విక్రయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త మద్యం విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఫిబ్రవరి 14 నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి లేఖ రాసినట్లు అన్నా హజారే వెల్లడించారు.
"సూపర్‌మార్కెట్లు, జనరల్ స్టోర్లలో మద్యం విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. దీనికి బదులు ప్రజలు మద్యానికి బనిసలు కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కాదని ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్నే అమలు చేస్తానంటే.. నేను ఆమరణ నిరాహార దీక్ష చేపడతా" అని అన్నా హజారే సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు లేఖ రాశానని, దానికి ఆయన స్పందించలేదని హజారే తెలిపారు.
జనవరి 27న రాష్ట్రంలోని 'మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)' ప్రభుత్వం ఈ కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో కేవలం వైన్ షాపుల్లోనే దొరికే మద్యాన్ని సూపర్‌మార్కెట్, జనరల్ స్టోర్లలోనూ విక్రయించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహరాష్ట్రని ఎంవీఏ ప్రభుత్వం మద్యరాష్ట్రగా మార్చేసిందని భాజపా విమర్శించింది.
ఇదీ చూడండి : 'యువతకు 50వేల ఉద్యోగాలు .. రైతులకు కనీస మద్దతు ధర'