కొత్త సంవత్సరం వేళ దేశరాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన అంజలి కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో అంజలితోపాటు ద్విచక్రవాహనంపై ఉన్న ఆమె స్నేహితురాలు నిధి ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారడంతో ఆమెపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందన్న దానిపై కూపీ లాగుతున్నారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిధిని అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. కేవలం విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. అంజలి మద్యం సేవించి వాహనం నడింపిందని నిధి ఆరోపించగా అంజలి కుటుంబం దాన్ని ఖండించింది.
శవపరీక్ష నివేదికలోనూ మద్యం ఆనవాళ్లు లభించలేదని అంజలి తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. దీంతో నిధి చెప్పినదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటన తర్వాత విషయం ఎవరికీ చెప్పకుండా నిధి పారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీల ఆధారంగా అంజలితోపాటు మరో యువతి ఉందని పోలీసులు గుర్తించిన తర్వాతే నిధి బయటికి రావడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. దీంతో దీనిపై నిధిని దిల్లీ పోలీసులు పూర్తిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో మరో కీలక విషయం బయటపడింది. ఇప్పటివరకు కారు నడిపినట్లు భావిస్తున్న దీపక్ ఖన్నా ఆ రోజు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ లేకుండా కారు నడిపిన తన బంధువు అమిత్ ఖన్నాను తప్పించేందుకే తాను కారు నడిపినట్లు దీపక్ ఖన్నా చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిందితులను కేసు నుంచి తప్పించేందుకు ఇద్దరు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరైన కారు యజమాని అశుతోష్‌ను ఇవాళ అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అంకుశ్ కోసం గాలిస్తున్నారు.