హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకొంటారు. మహాశివరాత్రి రోజు ప్రజలు కుటుంబ సమేతంగా శివాలయానికి వెళ్లి మహాశివుడిని దర్శించుకుంటారు. మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వాటిలో మధ్యప్రదేశ్‌లోని సోమేశ్వరాలయం ఒకటి. ఆ ప్రసిద్ధ శివాలయానికి ఓ ప్రాముఖ్యత ఉంది. దశాబ్దాలుగా మూసివేసిన ఆ దేవాలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు. ఆ సోమేశ్వరాలయం భోపాల్‌కు 48 కిలోమీటర్ల దూరంలో రైసెన్ జిల్లాలో ఉంది. 1,000 అడుగుల ఎత్తైన కొండపై ఆ శివాలయం ఉంది.
సోమేశ్వర ఆలయాన్ని 10 శతాబ్ధంలో నిర్మించగా.. 1283 సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మాలిక్ కాఫుర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్లు సోమేశ్వరాలయాన్ని ఆక్రమించుకున్నారు. 1543లో షేర్ షా సూరి ఆ దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. సామాన్య ప్రజల కోసం ఆ దేవాలయాన్ని తెరవాలని 1974లో ఉద్యమం జరిగింది. దీని తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ.. సోమేశ్వర దేవాలయానికి తాళం తీసి సామాన్య ప్రజలు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఆ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతించారు.
ప్రస్తుతం సోమేశ్వరాలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. మహాశివరాత్రి రోజు 12 గంటలపాటు అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆ దేవాలయాన్ని తెరుస్తారు. గతేడాది ఒక మతపరమైన కార్యక్రమంలో పండిత్ ప్రదీప్ మిశ్రా ఆ సోమేశ్వరాలయం గురించి ప్రస్తావించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
శనివారం జరగబోయే మహాశివరాత్రి పండుగకు కూడా దేవాలయాన్ని ఉదయం 6 గంటలకు తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తలు సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన ఐదు క్వింటాళ్ల కిచిడి, పండ్లను స్థానిక ప్రజలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.