Anand Mahindra Tamil letter image: తమిళ భాషలోని పురాతన, ప్రస్తుత అక్షరాలతో తన చిత్రపటాన్ని రూపొందించిన కళాకారుడిని దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. మొత్తం 741 ప్రాచీన, ప్రస్తుత తమిళ అక్షరాలను ఉపయోగించి ఆనంద్ మహీంద్ర బొమ్మ గీశాడు కాంచీపురానికి చెందిన గణేశ్.
సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన 25 ఏళ్ల గణేశ్.. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. బొమ్మలు గీయడం అంటే చాలా ఆసక్తి. ప్రాచీన తమిళ కవి తిరువళ్లువార్, తమిళనాడు సీఎం స్టాలిన్, సినీ నటుడు రజినీకాంత్, సంగీత దర్శకుడు ఇళయరాజా సహా పలువురు ప్రముఖుల బొమ్మలను గీశాడు. అక్షరాలతో చిత్రాలను తీర్చిదిద్దడం గణేశ్ ప్రత్యేకత. ఇదివరకు తమిళ నటుడు విజయ్ పేరును ఇంగ్లిష్‌లో రాస్తూ ఆయన చిత్రాన్ని గీశాడు గణేశ్. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఆనంద్ మహీంద్ర చిత్రాన్ని గీశాడు. దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీన్ని చూసిన ఆనంద్ మహీంద్ర.. యువకుడిని మెచ్చుకున్నారు. ఫొటోను చూసి ముగ్ధుడైన ఆనంద్ మహీంద్ర.. తమిళ భాష గౌరవార్ధం, కళాకారుడికి కృతజ్ఞతగా ఈ ఫొటోను తన ఇంట్లో పెడతానని చెప్పారు.
గణేశ్ అప్లోడ్ చేసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్ గణేశ్‌ను పలకరించింది. ఆనంద్ మహీంద్ర తన కళను గుర్తించడం సంతోషంగా ఉందని గణేశ్ చెప్పుకొచ్చాడు. పేద కుటుంబంలో పుట్టిన తనకు.. ఈ వృత్తిలో కొనసాగడం కష్టంగా మారిందని తెలిపాడు. తమిళనాడు ప్రభుత్వం తనకు తగిన గుర్తింపునిచ్చి.. డ్రాయింగ్ రంగంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.
ఇదీ చదవండి: