11 Rupees Canteen: ప్రస్తుతం ద్రవ్యోల్బణం రోజురోజుకీ పెరిగిపోతుంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొన్నాలన్నా కష్టంగా మారిన పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడినా.. తమకు అవసరాలను తీర్చుకోలేని పేదలు ఎంతో మంది ఉన్నారు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా.. నిత్యావసరాలు వస్తువుల ధరలు తగ్గించే నాథుడే కరవయ్యాడు. దీంతో సామాన్యుల కష్టాలు ఎప్పటికీ తీరడం లేదు. అలాంటి వారికి ఆశాకిరణంలా నిలుస్తోంది పంజాబ్‌కు చెందిన ఓ సంస్థ. కేవలం రూ. 11 రూపాయలకే కావాల్సిన వస్తువులను అందిస్తోంది.
జలంధర్ ఫుట్‌బాల్ చౌక్ సమీపంలోని 'లాస్ట్ హోప్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ క్యాంటీన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పేదలకు బట్టలు, చెప్పులు, బూట్లు, మందులు, రేషన్‌తో పాటు ఇతర వస్తువులు కేవలం రూ. 11 లభ్యమవుతాయి. నగరం నలుమూలల నుంచి పేదలు వచ్చి.. వారికి అవసరమైన వస్తువులను కొనుక్కుని తీసుకెళ్తున్నారు. చిన్న పిల్లల బట్టలు, వారు ఆడుకునే బొమ్మలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
పేదలకు 11రూపాయలకు సరుకులు అందించడమే కాకుండా మధ్యాహ్న సమయంలో చక్కటి భోజనాన్ని కూడా సరఫరా చేస్తోంది ఈ క్యాంటీన్. అన్నం, పప్పు, కూరతో కూడిన భోజనం పెట్టి పేదల కడుపు నింపుతోంది. కొన్నిసార్లు రోటీలు కూడా పెడుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు తక్కువ ధరకే ఆహారాన్ని సరఫరా చేస్తోంది. ఈ క్యాంటీన్‌ను పేద ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని నిర్వాహకుడు జతీందర్ పాల్ సింగ్ తెలిపారు. దుస్తులు, బూట్లు, పుస్తకాలు, రేషన్, ఇతర వస్తువులు ఇక్కడ కొనుగోలు చేసి.. ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారని ఆయన అన్నారు. వేలాది మంది పేదలకు నిస్వార్థ సేవ చేస్తున్నామని జతీందర్ పేర్కొన్నారు.
"ఈ క్యాంటీన్ మొదలుపెట్టినప్పుడు కేవలం 11 మంది సభ్యులే మా సంస్థలో ఉండేవారు. ప్రస్తుతం 1400 మంది వాలంటీర్లు, వెయ్యికు పైగా కుటుంబాల సాయంతో క్యాంటీన్ నడుస్తోంది. ప్రజలు తాము వాడకుండా వదిలేసిన పాత వస్తువులను ఇక్కడకు తెచ్చి అందజేస్తారు. వాటిని మేము శుభ్రపరిచి పేదలకు కేవలం రూ.11కే అందిస్తాం. దాంతో పాటు డొనేషన్ బాక్స్ కూడా పెట్టాం. అందులో వచ్చిన నగదుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీటితో పాటు పేదలకు అంబులెన్స్ సేవను కూడా కేవలం రూ.11కే అందిస్తున్నాం. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో 897 మంది మృతులకు దహన సంస్కారాలు నిర్వహించాం."
-జతీందర్ పాల్ సింగ్, ముఖ్య నిర్వాహకుడు
లాస్ట్ హోప్ సంస్థ చేస్తున్న సమాజసేవకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అందరి సహకారం వల్ల దిగ్విజయంగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది.
ఇవీ చదవండి: టీవీలో అది చూసి ఉరేసుకున్న బాలుడు.. ఆ ఊళ్లో తీవ్ర విషాదం
రాష్ట్రపతి ఎన్నికపై ఖర్గే- రాజ్‌నాథ్ కీలక చర్చలు.. ఏకగ్రీవం దిశగా...!