శనివారం జరిగిన అసోం, బంగాల్ తొలి విడత ఎన్నికల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాల్లో చాలా ఏళ్ల తర్వాత పోలింగ్ ప్రశాంతంగా సాగిందని చెప్పారు. ఘర్షణల వల్ల ఎక్కడా ఒక్కరూ కూడా చనిపోలేదని వివరించారు. భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్న రెండు రాష్ట్రాల ప్రజలకు దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలియజేశారు.
ఎన్నికల అనంతరం భాజపా నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో చర్చలు జరిపినట్లు షా చెప్పారు. తొలి విడతలో బంగాల్లో 30 స్థానాలకు 26 చోట్ల భాజపానే గెలుస్తుందనే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అసోంలోనూ 47 స్థానాలకు 37 సీట్లకు పైగా భాజపానే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 8 విడతల ఎన్నికల అనంతరం బంగాల్లో మొత్తం 200 స్థానాలకు పైగా గెలిచి భాజపా అధికారం దక్కించుకుంటుందని షా ఉద్ఘాటించారు.
పవార్‌తో భేటీపై
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో అహ్మదాబాద్‌లో సమావేశమయ్యారని వస్తున్న వార్తలపైనా షా స్పందించారు. ప్రతి విషయాన్ని బహిరంగంగా వెల్లడించలేమని బదులిచ్చారు.
కేరళ గోల్డ్ స్కాంపై
కేరళ బంగారం అక్రమ రావాణా కుంభకోణం కేసులో కేంద్ర సంస్థల దర్యాప్తుపై న్యాయవిచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపైనా షా స్పందించారు. అప్రతిష్ఠ పాలు కాకుండా ఉండేందుకు కేరళ సర్కార్ అంతకన్నా ఇంకేం చేయగలదని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: 'కేరళ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం'