Amit shah in Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయోధ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. రామాలయ నిర్మాణం ఆలస్యం కావడానికి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని ధ్వజమెత్తారు. కరసేవకులపై కాల్పులు జరిపింది ఎవరో? కొన్నేళ్ల పాటు రామ్‌లల్లా టెంటు కిందే ఉండటానికి కారకులెవరో? ప్రజలు గుర్తు చేసుకోవాలని సూచించారు.
"రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేశాయి. కర సేవకులపై కాల్పులు జరిపింది ఎవరో మీకు గుర్తుందా? వాళ్లను దారుణంగా హింసించారు. చంపి సరయూ నదిలో పడేశారు. రామ్ లల్లా కొన్ని సంవత్సరాల పాటు టెంటు కిందే ఎందుకు ఉండాల్సి వచ్చింది? అయోధ్యలో రామనవమి, దీపోత్సవాన్ని ఎవరు ఆపారు? ఇవన్నీ మనం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాలయ నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీపై పదునైన విమర్శలు చేశారు షా. వారి హయాంలో వారసత్వం, పక్షపాతం, వలసలు ఉండేవని దుయ్యబట్టారు. భాజపా అధికారంలో వచ్చాక యూపీ అభివృద్ధి, వ్యాపారం, సాంస్కృతిక వారసత్వం దిశగా నడుస్తోందన్నారు. యూపీలో సుగంధ ద్రవ్యాల వ్యాపారులపై జరుగుతున్న ఐటీ దాడులపైనా షా మాట్లాడారు. ఎస్పీ అవినీతిమయమని, పాపాలలో కూరుకుపోయిందని విమర్శించారు. అక్రమ వ్యాపారులపై దాడులు జరిగితే అఖిలేశ్ యాదవ్ ఎందుకు కలత చెందుతున్నారని ప్రశ్నించారు.
పన్ను ఎగవేత ఆరోపణలతో శుక్రవారం ఉదయం ఎస్పీ ఎంఎల్సీ , పర్ఫ్యూమ్ వ్యాపారి పుష్పరాజ్ జైన్, మరో నేత నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇప్పటికే కాన్పుర్ వ్యాపారవేత్త పీయూష్ జైన్ నివాసాల్లో తనిఖీలు చేసిన అధికారులు దాదాపు రూ.200 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం యూపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
ఇదీ చదవండి: 'ఐటీ దాడులతో 'అఖిలేశ్ యాదవ్' వణికిపోయారా?'