బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి ఎలా గాయమైందో ఇప్పటికీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ ఘటనను టీఎంసీ 'దాడి'గా అభివర్ణిస్తుంటే.. ఎన్నికల సంఘం మాత్రం ప్రమాదవశాత్తు జరిగినట్టు చెబుతోందని వ్యాఖ్యానించారు.
రాణిబంద్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అమిత్ షా. ఈ నేపథ్యంలో మమత పాలనపై విరుచుకుపడ్డారు. కాలి నొప్పితోనే చక్రాల కుర్చీలో తిరుగుతున్నానంటున్న దీదీ.. టీఎంసీ పాలనలో చనిపోయిన 130మంది భాజపా కార్యకర్తల తల్లుల బాధను ఎప్పుడు పట్టించుకుంటారని ప్రశ్నించారు.
'కుట్ర అనను...'
తన హెలికాప్టర్లో సాంకేతిక లోపం వల్ల సభకు ఆలస్యంగా హాజరయ్యారు షా. దీనిపైనా టీఎంసీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన హెలికాప్టర్లో కలిగిన సాంకేతిక లోపాన్ని కుట్ర అనను అని ఎద్దేవా చేశారు.
ఈ నెల 10.. నామినేషన్ దాఖలు చేసేందుకు నందిగ్రామ్ వెళ్లిన మమతా బెనర్జీ కాలికి గాయమైంది. తనపై దాడి జరిగిందని ఆమె ఆరోపించారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం మమతపై దాడి జరగలేదని పేర్కొంది.
ఇదీ చూడండి:- చక్రాల కుర్చీపైనే మమతా బెనర్జీ ర్యాలీ