Amit Chaudhary Advocate Inspirational Story : కొంతమంది ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని కేసుల్లో నిందితులుగా ఇరుక్కుంటుంటారు. కొన్ని నెలలపాటు జైలులో కూడా గడుపుతుంటారు. ఆ సమయంలో సదరు వ్యక్తులు తీవ్రంగా కుంగిపోతుంటారు. మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తుంటారు. చివరకు డిప్రెషన్లోకి వెళ్లి సాధారణ జీవితం గడపలేని స్థితికి చేరుకుంటుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమిత్ చౌదరి కథ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.
వివరాల్లోకి వెళ్తే
మేరఠ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య కేసులో అమిత్ చౌదరిని 12 ఏళ్ల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. చేయని నేరానికి నిందితుడిగా ఇరుకున్న అమిత్‌పై పోలీసులు గ్యాంగ్‌స్టర్ ముద్ర కూడా వేశారు. అయితే హత్యకు గురైన వారు పోలీసులు కావడం వల్ల అందరి దృష్టి ఈ కేసుపైనే ఉండేది. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని అప్పటి యూపీ ముఖ్యమంత్రి మాయావతి ఆదేశించారు.
మేరఠ్‌లో లేకపోయినా..
అయితే హత్యలు జరిగిన సమయంలో అమిత్ మేరఠ్‌లో లేరు. షామ్లీ పట్టణంలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్నారు. అయినా ఈ కేసులో అరెస్టయిన 17 మందిలో ఆయన్ను కూడా చేర్చారు పోలీసులు. కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా కైల్ అనే వ్యక్తికి చెందిన గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉంటూ హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. దీంతో అమిత్ రెండేళ్ల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. అయితే తన జీవితంలో వచ్చిన సంక్షోభాన్నే సదావకాశంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు అమిత్. న్యాయ విద్య అభ్యసించి తాను ఇరుకున్న కేసును తానే కోర్టులో వాదించుకున్నారు. మర్డర్ కేసులో నిర్దోషిగా బయటపడ్డారు.
గ్యాంగ్‌లలో చేరాలని..
జైలు జీవితం గడుపుతున్న సమయంలో అనేక మంది తనను వారి గ్యాంగ్‌లలో చేరాలని ప్రోత్సహించారని అమిత్ స్వయంగా చెప్పారు. కానీ వాటిని తాను తిరస్కరించానని తెలిపారు. ఈ క్రమంలో ఓ జైలర్ కూడా తనకు సహకరించారని వెల్లడించారు. తనను గ్యాంగ్‌స్టర్‌లు ఉండే బ్యారక్‌లో కాకుండా వేరే దాంట్లోకి మార్చారని తెలిపారు.
కుటుంబం తలెత్తుకునేలా చేయాలని..
రెండేళ్ల జైలు జీవితం తర్వాత అమిత్ 2013లో విడుదలయ్యారు. ఎట్టకేలకు ఈ కేసులో నిర్దోషిగా బయటపడాలని నిశ్చయించుకున్నారు. తద్వారా తన కుటుంబం తలెత్తుకుని తిరిగేలా చేయాలనుకుని ఫిక్సయ్యారు. మనసులోని కుంగుబాటునంతా పక్కనబెట్టారు. న్యాయవిద్యను అభ్యసించడంలో నిమగ్నమయ్యారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. బార్ కౌన్సిల్ పరీక్షలో కూడా పాసయ్యారు. చట్టపరమైన అంశాల్లో వచ్చిన పట్టుతో తన కేసును తానే టేకప్ చేసుకున్నారు.
మొదట్లో నత్తనడకన
మొదట్లో పోలీసులు ఎలాంటి స్టేట్‌మెంట్లు, ఆధారాలు సేకరించకపోవడం వల్ల ఈ కేసు నత్తనడకన సాగిందని అమిత్ తెలిపారు. తన న్యాయ విద్య పూర్తయ్యే వరకు అసలు కేసులో ఎలాంటి పురోగతి రాలేదని పేర్కొన్నారు. దీంతో పూర్తిగా ఈ కేసు పైనే దృష్టి సారించి కోర్టులో వాదనలు వినిపించినట్లు చెప్పారు. విచారణలో భాగంగా ఓసారి తనను అరెస్టు చేసిన పోలీసు అధికారి బోనులో నిలబడాల్సి వచ్చిందని కూడా తెలిపారు. ఆ సందర్భంలో న్యాయవాదిగా కేసు వాదిస్తున్న తనను సదరు అధికారి గుర్తుపట్టకపోవడం జడ్జిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించారు. దీంతో కేసులో నిందితులను ఎంత గుడ్డిగా చేర్చారో న్యాయమూర్తికి అర్థమైందని చెప్పారు.
13 మంది నిర్దోషులే
తన ప్రమేయం ఉన్నట్లుగా నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు కోర్టుకు సమర్పించలేకపోయారని అమిత్ తెలిపారు. అలా ఈ కేసులో తనతో పాటు మొత్తం 13 మందిని కోర్టు ఇటీవలే నిర్దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో అసలు నేరస్థులైన ముగ్గురిలో సుమిత్ కైల్ 2013లో ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. నీతు అనే మరో వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో వ్యక్తి ధర్మేంద్ర ఇటీవలే క్యాన్సర్‌తో మరణించాడు.
దేశానికి సేవ చేసే అవకాశం!
భారత సైన్యంలో సేవలు అందించాలన్న తన కలలు ఈ కేసుతో చెదిరిపోయాయని వాపోయారు అమిత్. కానీ న్యాయవాది రూపంలో దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. అన్యాయానికి గురైనవారికి ఈ వృత్తితో అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. క్రిమినల్ జస్టిస్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నానని తెలిపారు.
12ఏళ్లలో 300స్టోర్లు.. లాభాల బాటలో 'బిగ్ బాస్కెట్'.. హరి మీనన్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
రిక్షావాలా నుంచి క్యాబ్ కంపెనీ ఓనర్‌గా దిల్'ఖుష్'... యువ పారిశ్రామికవేత్త సక్సెస్ జర్నీ