వ్యవసాయ చట్టాలపై వారం రోజులుగా రైతులు ఉద్ధృతంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సమావేశం కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిష్టంభనకు స్నేహపూర్వక పరిష్కార కోసం సింగ్ గురువారం ఉదయం దిల్లీలో షాతో చర్చలు జరుపుతారని వర్గాలు తెలిపాయి.
రైతులకు మద్దతుగా ఉన్న అమరీందర్.. సమష్టి ప్రయోజనం కోసం కేంద్రం, రైతుల మధ్య చర్చల్లో తాను, తన ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అన్నదాతల సమస్యలపై గురువారం(డిసెంబర్3) కేంద్రం చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం సాయంత్రం.. అమిత్ షా నివాసంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ సమావేశమై రైతుల ఆందోళనపై చర్చించారు. తదుపరి వ్యూహాలపై సమాలోచనలు జరిపారు.
ఇదీ చూడండి: 'సాగు చట్టాల రద్దుకై పార్లమెంటును సమావేశపర్చండి'