భవిష్య నగరాల్లో 'అమరావతి'... ప్రతిష్ఠాత్మక ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ మ్యాగజైన్‌లో కథనం - ocainsic Busan at south coria
AMARAVATI CAPITAL: ప్రపంచంలోనే అత్యద్భుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో రాజధాని అమరావతికి చోటు దక్కింది. రాబోయే 50 సంవత్సరాల్లో ప్రపంచం ఎలా ఉండబోతోందనే దానికి.. అమరావతి, వివిధ దేశాల్లోని మరో 5 నగరాలు అద్దం పట్టనున్నాయని ప్రపంచ ప్రతిష్టాత్మక మ్యాగజైన్ 'ఆర్కిటెక్చరల్ డైజెస్ట్' వెల్లడించింది.

AMARAVATI CAPITAL: అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా 1820లో ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మాగజైన్ ప్రారంభించారు. గత 103 ఏళ్లుగా ఇది.. వివిధ రూపాల్లో నడుస్తోంది. ఇటలీ, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, స్పెయిన్, మెక్సికో, లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల్లోనూ ఈ పత్రిక ఎడిషన్లు, వెబ్ సైట్లు నడుస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ మాగజైన్.. 6 మోస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ బీయింగ్ బిల్ట్ అరౌండ్ ది వరల్డ్' శీర్షికతో.. నగరాల నమూనాలతో సహా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ జాబితాలో.. అమరావతిని చేర్చింది. అమరావతిని ప్రపంచ భవిష్య నగరంగా కొనియాడింది.
బొటానికల్ గార్డెన్, మెక్సికో: ఈ మాగజైన్ ప్రచురించిన 6నగరాలను పరిశీలిస్తే.. మెక్సికోలోని క్యాన్‌కున్ నగరానికి సమీపంలో భవనాలు, హరిత ప్రాంతాల సమతుల్యతతో ఒక బొటానికల్ గార్డెన్‌లా నగరాన్ని నిర్మించ తలపెట్టారు. ఇటాలియన్ అర్కిటెక్ట్ స్టెఫానో బోరి ఈ నగర నిర్మాణ ప్రణాళికల్ని 2019లో ఆవిష్కరించారు. వివిధ వృక్షజాతులకు చెందిన 75లక్షల మొక్కలు ఈ నగరంలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రైవేటు ఉద్యనవనాలు, పబ్లిక్ పార్కులు, పచ్చని ముఖద్వారాలు, పచ్చని పైకప్పులతో నగరాన్ని నిర్మించ తలపెట్టారు. మొత్తం 557హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించాలనేది ప్రణాళిక.
చెంగు స్కై వ్యాలీ, చైనా: చైనాలో చెంగు స్కై వ్యాలీ నగరాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ భవిష్య నగరంగా నిర్మించనున్నారు. ఈ లోయలో ఉన్న వివిధ సంప్రదాయ తెగల నివాసాలను పరిరక్షిస్తూనే ఈ నగరాన్ని నిర్మించదలచారు. ఈ లోయ ప్రాముఖ్యం పెంచేలా ఈ కొండలపైనే భవనాల్ని నిర్మించనున్నారు. ఈ ప్రాంతంలోని పొలాలను రక్షిస్తూనే వాటి మధ్య నగరాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. ప్రకృతితో కలిసి మమేకమయ్యేందుకు అనుగుణంగా ఈ నగర నిర్మాణం చేపట్టనున్నారు. గ్రామీణ వాతావరణం, సంప్రదాయాలు, ఆధునికత కలగలిసిన నగరంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
టెలోసా, అమెరికా: అంతర్జాతీయ ప్రమాణాలతో మానవ సామర్థ్యాలను విస్తరించేలా, భావితరాలకు ఒక బ్లూ ప్రింట్‌లా ఉండేలా అమెరికాలో కొత్త నగరాన్ని సృష్టించాలనే లక్ష్యంతో దీన్ని టెలోసా నగరాన్ని... నిర్మించ తలపెట్టారు. మార్క్ లోర్ అనే కోటీశ్వరుడు ఈ నగర నిర్మాణానికి రూప కల్పన చేశారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం, హరిత ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చి పరిరక్షించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి పౌరుడికీ నగర భూభాగంలో వాటా ఉండేలా సమానత్వం అనే ఆలోచన చుట్టూ ఈ నగరాన్ని కట్టనున్నారు.
ఓషియానిక్స్ బూసన్ నగరం, దక్షిణ కొరియా: 2050 నాటికి 50 లక్షల జనాభా ఇక్కడ నివసించేలా చేయాలనేది లక్ష్యం.సముద్రమట్టాల పెరుగుదల, వాతావరణ మార్పుల వంటి సమస్యలున్న తీరప్రాంత సమూహాలకు ఆదర్శంగా ఉండేలా దక్షిణ కొరియాలో ఓషియానిక్స్ బూసన్ నగర నిర్మాణాన్ని తలపెట్టారు. ఇది పూర్తైతే మొట్టమొదటి 'తేలియాడే నగరం' ఇదే కానుంది. 2025 నాటికి నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యం.
ద లైన్, సౌదీ అరేబియా: కార్లు అవసరం లేని, కర్బన ఉద్గారాలు లేని నగరంగా సౌదీ అరేబియాలో ద లైన్ పేరుతో నగరాన్ని తీర్చిదిద్దాలనేది ప్రణాళిక. హైస్పీడ్ రవాణా వ్యవస్థ ఈ నగరానికి ప్రత్యేకం. 2030 సంవత్సరం నాటికి ఈ నగర నిర్మాణాన్ని పూర్తిచేయాలని సౌదీ అరేబియా లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం 100 నంచి 200 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. 100 మైళ్ల పొడవున ఈ నగరం ఉంటుంది. మొత్తంగా 4.60 లక్షల ఉద్యోగాల సృష్టించి, దేశ జీడీపీకి 48 బిలియన్ డాలర్లు సమకూర్చటమే దీని ప్రధాన లక్ష్యం.
అమరావతి, ఆంధ్రప్రదేశ్: ప్రపంచంలోని భవిష్య నగరాలు ఎలా ఉంటాయో చూపేందుకు ఒక మచ్చుతునకగా అమరావతి ఉంటుందని మాగజైన్ తన కథనంలో వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నగరానికే తలమానికంగా నిలిచేలా ఫోస్టర్ అండ్ పార్టనర్స్ బృహత్ ప్రణాళిక రూపొందించారు. దిల్లీలోని లూటెన్స్, న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కు స్ఫూర్తితో నగరానికి వెన్నెముకలా సెంట్రల్ గ్రీన్ స్పేస్‌ను తీర్చిద్దాలనేది ప్రతిపాదన.
మొత్తం విస్తీర్ణంలో 60శాతం మేర పచ్చదనం.. నీళ్లు ఉండేలా.. హరిత, నీలినగరంగా నిర్మించేలా పనులు చేపట్టారు. ప్రపంచంలోనే సుస్థిర నగరంగా.. సరికొత్త వర్ధమాన సాంకేతికతలతో కూడిన నగరంగా దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విద్యుత్ వాహనాలు, నీటి ట్యాక్సీలు, ప్రత్యేకమైన సైకిల్ మార్గాలతో అత్యద్భుతంగా అమరావతి నగరాన్ని నిర్మించాలనుకున్నారని మాగజైన్ తన కథనంలో తెలిపింది.
టీడీపీ హయాంలో ఘనంగా.. వైసీపీ ఆగిపోయిన పనులు: అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు తెలుగుదేశం హయాంలో 2014-19 మధ్య విశేష కృషి జరిగింది. ఎక్కడా లేని విధంగా రైతులే ముందుకొచ్చి ఈ నగర నిర్మాణానికి 33వేల ఎకరాల వ్యవసాయ భూమి.. భూ సమీకరణ విధానంలో ప్రభుత్వానికి ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూముల్లో నగర నిర్మాణానికి బృహత్ ప్రణాళిక రూపొందించి దానికి అనుగుణంగా పలు నిర్మాణాలు ప్రారంభించారు. రోడ్లు, కాలవలు, వంతెనలు తదితర మౌలికవసతుల నిర్మాణం కొంతమేర పూర్తైంది. దిగ్గజ భవనాల నిర్మాణమూ చేపట్టారు.
టీడీపీ హయాంలో మొత్తం 10వేల కోట్ల రూపాయలు వెచ్చించి నగర నిర్మాణాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చారు. తర్వాత అదే వేగంతో పనులు కొనసాగి ఉంటే..ఈ పాటికే మౌలిక వసతులు ఒక రూపు సంతరించుకునేవి. కానీ వైసీపీ అధికారం చేపట్టాక అమరావతిపై కక్ష కట్టింది. నిరాధార, అసత్య ఆరోపణలతో నగర నిర్మాణాన్ని పూర్తిగా నిలివేసింది. ప్రపంచానికే తలమానికంగా నిలిచే భవిష్యనగరంలా అమరావతిని నిర్మించేందుకు ఉన్న మహత్తర అవకాశాన్ని, కాలాన్నీ వృథా చేసింది.
ఇవీ చదవండి: