ఐదేళ్ల చిన్నారి హత్యాచారం కేసు నిందితుడికి ఉరిశిక్ష- బాలల దినోత్సవం రోజే తీర్పు - aluva child murder case
Aluva Murder Case Judgement : ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ కేరళలోని పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలల దినోత్సవం నాడు ఈ తీర్పునివ్వడం విశేషం.
Published : Nov 14, 2023, 1:03 PM IST
|Updated : Nov 14, 2023, 1:22 PM IST
Aluva Murder Case Judgement : కేరళలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడు అస్ఫాక్ ఆలమ్‌కు ఎర్నాకులం పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆరు లక్షల రూపాయల జరిమానా కూడా వేసింది. దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుగుతున్న వేళ.. కోర్టు ఈ తీర్పునివ్వడం విశేషం.
కేరళ హైకోర్టు నిర్ధరించిన తర్వాత..
Aluva Murder Case News : బిహార్‌కు చెందిన ఐదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ ఆలమ్‌ను ఉరితీయాలని ప్రత్యేక పోక్స్ కోర్టు జడ్జి కె.సోమన్ ఆదేశించినట్లు ప్రభుత్వ న్యాయవాది జి.మెహన్‌రాజ్ తెలిపారు. కేరళ హైకోర్టు నిర్ధరించిన తర్వాత మరణశిక్షను అమలు అవుతుందని ఆయన చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టం ప్రకారం నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించినట్లు వెల్లడించారు.
'బాలల దినోత్సవం నాడు తీర్పు.. వారికి గట్టి హెచ్చరిక'
చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. అత్యంత దారుణమైన నేరానికి చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థుడిని పట్టుకుని గరిష్ఠంగా శిక్ష పడేలా న్యాయ వ్యవస్థ మొత్తం సమర్థంగా పనిచేసిందని కొనియాడారు. బాలల దినోత్సవం రోజున వెలువడిన ఈ తీర్పు.. హింసకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా భావించాలని ఆయన తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమని.. ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయం చేస్తుందని చెప్పారు.
'బాలల హక్కులపై అవగాహన పెంచుకోవాలి'
రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా ఎర్నాకులం పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. పిల్లలకు హాని చేయకూడదని సమాజానికి ఇది బలమైన సందేశాన్ని పంపుతుందని చెప్పారు. రికార్డు సమయంలో తీర్పునిచ్చిన పోక్సో కోర్టును ప్రశంసించారు. బాలల హక్కులపై సమాజం అవగాహన పెంచుకుని వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆలమ్‌కు కోర్టు విధించిన శిక్షను ఏడీజీపీ అజిత్ కుమార్ కూడా స్వాగతించారు.
Aluva Child Murder Case : 2023 జులై 28వ తేదీన కొచ్చి సమీపంలోని అలువాలోని నివాసం ఉంటున్న బిహార్‌కు చెందిన చిన్నారి కిడ్నాప్ అయింది. ఆ చిన్నారికి స్వీట్లు ఆశ చూపించి తనతోపాటు తీసుకెళ్లాడు నిందితుడు. ఆ తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. తర్వాత రోజు పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. నవంబర్ 4వ తేదీన ఈ కేసులో ఆలమ్‌ను దోషిగా నిర్ధరించిన కోర్టు.. ఉరిశిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది.
Man Sentenced To 240 Years In Prison: భార్య సహా ఇద్దరు హత్య.. 240 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు