దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దిల్లీలో వేధింపులు డ్రామా అంటూ కమలదళం ఆరోపించగా.. ఆమె తీవ్రంగా ప్రతిస్పదించారు. బదులుగా ఎదురుదాడికి దిగిన భాజపా... స్వాతి మాలీవాల్‌ను దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఆమెను వేధించిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను భాజపా దిల్లీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ కోరారు. దర్యాప్తు పూర్తయ్యే వరకూ దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి స్వాతిని తప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆమెను వేధించిన వ్యక్తి ఆమ్ ఆద్మీ కార్యకర్త అని వార్తలు వస్తున్నట్లు కపూర్ చెప్పారు. నిందితుడు హరీశ్ చంద్ర సూర్యవంశీ ఆప్ ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేసినట్లు ఫోటోలు కూడా ఉన్నాయని వివరించారు. ఆమె పదవిలో ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారు కాబట్టి విచారణ పూర్తయ్యే వరకూ తప్పించాలని కోరారు.
తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు స్వాతి మాలీవాల్. 'నా గురించి చెత్త అబద్ధాలు చెప్పి, నన్ను భయానికి గురిచేయాలనుకునే వారికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ చిన్న జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. ఎన్నో సార్లు దాడులు చేశారు. కానీ నేను ఆగలేదు. ప్రతి దాడితో నాలో ఉన్న జ్వాల మరింత రగులుతూనే ఉంది. నా గళాన్ని ఎవరూ అణచివేయలేరు. నేను జీవించి ఉన్నంత కాలం పోరాడుతూనే ఉంటా' అని ఆమె ట్వీట్ చేశారు.
కాగా, గురువారం దేశ రాజధాని దిల్లీలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్‌ను 47ఏళ్ల హరీశ్ చంద్ర అనే వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన రాజధాని నగరంలో తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సైతం వెలుగులోకి వచ్చింది. దిల్లీలో మహిళా భద్రతను పరిశీలించేందుకు స్వాతి మాలీవాల్ గురువారం తెల్లవారుజామున నగరంలోని కొన్ని ప్రదేశాల్లో తన బృందంతో పాటు పర్యటించారు. సుమారు 3 గంటల 5 నిమిషాల సమయంలో ఎయిమ్స్ బస్టాండు దగ్గర ఉండగా ఓ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. వచ్చి కార్లో కూర్చోమని ఆ వ్యక్తి స్వాతిని అడిగాడు. దీనికి ఆమె బదులిస్తూ.. నాకు వినిపించట్లేదు. ఎక్కడ డ్రాప్ చేస్తారు? నేను మా ఇంటికి వెళ్లాలి. మా బంధువులు వస్తున్నారు అని స్వాతి చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాసేపటికే మళ్లీ యూటర్న్ తీసుకుని వచ్చి ఆమెను మళ్లీ కారులో కూర్చోమని అడిగాడు. దీంతో స్వాతి ఆగ్రహానికి గురయ్యారు. నన్ను ఎక్కడకు తీసుకెళ్లాలనుకుంటున్నావ్? నువ్వు రావడం ఇది రెండోసారి. ఇలాంటివి వద్దని పదే పదే చెబుతున్నా అంటూ కారు డ్రైవర్ వద్దకు వెళ్లారు. నిందితుడిని పట్టుకోవడానికి స్వాతి కారు లోపలకు చేయి పెట్టగా అతడు కారు అద్దాన్ని పైకి వేసేశాడు. ఈ క్రమంలో ఆమె చెయ్యి ఇరుక్కుపోయింది. అలానే కారును ముందుకు పోనిచ్చి సుమారు 15 మీటర్లు స్వాతి మాలీవాల్‌ను ఈడ్చుకెళ్లాడు. ఆమె నొప్పితో కేకలు వేయడం వీడియోలో వినిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా నిందితుడ్ని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది.