Punjab polls 2022: పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు ఆదివారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉండగావారిలో 93 మంది మహిళలు. పంజాబ్ ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ స్థానం నుంచి.. పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్.. ధురి నియోజకవర్గ బరిలో నిలిచారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్‌సర్ తూర్పు స్థానం నుంచి పోటీలో ఉన్నారు. మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత అమరీందర్ సింగ్ తమ కుటుంబానికి గట్టి పట్టున్న పటియాలా అర్బన్ బరిలో నిలిచారు. అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ బాదల్.. జలాలాబాద్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్.. లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
పంజాబ్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ఉన్నా శిరోమణి అకాలీదళ్ సహా భాజపా కూటమి కూడా సై అంటున్నాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలకు పంజాబ్ కేంద్రంగా నిలిచింది. ఈ అంశం కలిసి వస్తుందని కాంగ్రెస్, ఆప్ రెండూ ధీమాగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ను అంతర్గత కలహాలు కలవరపెడుతున్నాయి. శిరోమణి అకాలీదళ్, బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నాయి. భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాలీదళ్ సంయుక్త్ పార్టీలు ఉమ్మడిగా బరిలో ఉన్నాయి.
పంజాబ్‌లో పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
UP Election 2022: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. యూపీలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా ఆదివారం మూడో దశ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో మూడో దశలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు వీరి భవిష్యత్తును తేల్చనున్నారు.
ఆత్మ విశ్వాసంతో ఎస్పీ..
యూపీలో మూడో విడత పోలింగ్ జరగనున్న 16 జిల్లాల్లో 8 జిల్లాలను యాదవ్ సామాజిక బెల్ట్‌గా పరిగణిస్తుంటారు. వాటిలో 29 స్థానాలు ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్న కర్హల్ స్థానం కూడా ఇందులో ఉంది. అఖిలేశ్ పోటీ నేపథ్యంలో కంచుకోట లాంటి యాదవ్ సామాజిక బెల్ట్ అంతటా ఈసారి మెజార్టీ స్థానాలు గెలుస్తామని సమాజ్‌వాదీ పార్టీ ధీమాగా ఉంది. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ గతంలో తాను 5 సార్లు గెలిచిన జశ్వంత్ నగర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆదివారం పోలింగ్ జరగనున్న 59 స్థానాల్లో 2017 ఎన్నికల్లో భాజపా 49 స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీకి 9, కాంగ్రెస్‌కు ఒక స్థానం దక్కాయి. ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత, 3 సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం, యాదవ్ సామాజిక వర్గం సానుకూలత, ముస్లిం ఓటర్ల మద్దతుతో తాము మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఎస్పీ ఆత్మ విశ్వాసంతో ఉంది.
up polls phase 3: యూపీ మూడో విడతలో గెలుపుపై అధికార భాజపా కూడా ధీమాగానే ఉంది. గత అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపైనే భాజపా ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభ.. శాంతి భద్రతలను అదుపు చేయడం, అయోధ్య, కాశీ క్షేత్రాల అభివృద్ధి వంటి పరిణామాలు కలిసి వస్తాయని.. కమలదళం అంచనా వేస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగి, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతంలో చురుగ్గా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో ఆ పార్టీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. యూపీ మూడో విడత పోలింగ్‌కు ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
ఇదీ చూడండి: పంజాబ్ చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు? కింగ్ మేకర్‌గా ఆ పార్టీ?