Demolition Of Twin Towers: 'ఎంతోమందికి తల దాచుకునేందుకు గూడు లేదు. రాత్రిళ్లు ఫుట్‌పాత్‌లపై పడుకొంటున్నారు. కారణాలు ఏవైనా ఇంత పెద్ద భవనాలు పడగొడుతుంటే బాధగా ఉండదా!'.. పదహారేళ్ల సబీనా ఖానం అనే యువతి ఆవేదన ఇది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేర ఆదివారం మధ్యాహ్నం కూల్చివేతకు అంతా సిద్ధమైన నోయిడా జంట భవనాల్లోని ఓ ఫ్లాటులో ఈమె తల్లి పనిచేస్తున్నారు. '40 అంతస్తుల ఈ భవన నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. నిర్మాణంలో అక్రమాలు జరిగినా, పడగొట్టకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఆలోచించి ఉంటే బాగుండేది. మాలాంటివాళ్లకు ఇల్లు లేని విషయం కూడా ఆలోచించాలి కదా!'.. పద్దెనిమిదేళ్ల మజీద్ ఆలం అనే యువకుడి అభిప్రాయమిది.
వంద మీటర్ల ఎత్తున కట్టిన ఈ జంట భవనాల ముందున్న పార్కు పిట్టగోడపై కూర్చొన్న బాలల స్పందన మరోలా ఉంది. 'అబ్బా! సినిమాల్లో, టీవీల్లోనే ఇలాంటి దృశ్యాలు చూస్తాం. వేల కిలోల పేలుడు పదార్థాలు వాడతారట. నీకు తెలుసా? బటన్ నొక్కగానే పేకమేడల్లా ఈ భవనాలు కూలిపోతాయట. రేపు మనం తొందరగా వచ్చేయాలి. ఇక్కడి నుంచైతే భలే బాగా చూడొచ్చు. ఆలస్యం చేస్తే మళ్లీ జనం వచ్చేస్తారు'.. నోయిడా జంట భవనాలకు అల్లంత దూరాన పూరిగుడిసెల్లో నివసించే కుటుంబాలకు చెందిన మహమ్మద్ జుల్ఫికర్ (14), ఇర్ఫాన్ (10), వారి ఇతర మిత్రుల నడుమ శనివారం సాగిన సంభాషణ ఇది.
సూపర్‌టెక్ నిర్మాణసంస్థ నిర్మించిన ఈ జంట భవనాల కూల్చివేతకు తుది ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని నోయిడా అథారిటీ సీఈవో రితు మహేశ్వరి తెలిపారు. పోలీసుల నుంచి క్లియరెన్సు రాగానే.. మీట నొక్కేచోట ముగ్గురు విదేశీ నిపుణులు, పేల్చివేతల కంపెనీకి చెందిన చేతన్ దత్తా, ఓ పోలీసు అధికారి, తాను మొత్తం ఆరుగురు మాత్రమే ఉంటామని ఎడిఫిస్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ మయూర్ మెహతా తెలిపారు.
ఇవీ చదవండి: ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రేరణగా ఖాదీ నిలుస్తోందన్న మోదీ, అటల్ వంతెన ప్రారంభం
నిద్రిస్తున్న మహిళపై పడగ విప్పిన నాగుపాము, దేవుడ్ని ప్రార్థించగానే