దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు మరో 10రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార ఎన్డీఏ సర్కారు తాము పోటీకి దించిన అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం నల్లేరు మీద నడకలా మార్చేందుకు పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో భాజపా ఎంపీలంతా పాల్గొనేందుకు.. ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయ జనతాపార్టీ పార్లమెంట్ సభ్యులంతా రెండురోజులముందే దిల్లీకి చేరుకునేలా ఆదేశాలు జారీచేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఎంపీలంతా ఈనెల 16నే హస్తినకురావాలని, 18వ తేదీ వరకు అక్కడే ఉండేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ 2రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక గురించి ఎంపీలకు అవగాహన కల్పిస్తారు. ఓటు ఎలా వేయాలనే విషయమై శిక్షణ ఇవ్వనున్నట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 16న పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎంపీలకు విందు ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అధికార పార్టీ నుంచి ద్రౌపది ముర్ము.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఈనెల21న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం సభ్యుల సంఖ్య 4,809కాగా.. వారి ఓటు విలువ 10,86,431. లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల సభ్యులకు మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. పార్లమెంటు, శాసనసభలకు నామినేటైన సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటుహక్కు ఉండదు. ఓటు చెల్లుబాటు కావాలంటే తొలి ప్రాధాన్యత సంఖ్యను తప్పనిసరిగా మార్క్‌చేయాలి. ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఓటు వేయటానికి ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్ను ఇస్తుంది. ఎలక్టోరల్ సభ్యులు ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది.
ముర్ముకు సన్మానం..: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. శుక్రవారం ఒడిశాకు వెళ్లారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఆమె ఘన స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు. ద్రౌపది ముర్ము.. ఒడిశాకు చెందిన వారే కావడం వల్ల.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు మద్దతు తెలపనున్నట్లు ఇప్పటికే సీఎం నవీన్ ప్రకటించారు.
ఇదీ చదవండి: సీఎం భార్య ట్విట్టర్ ఖాతా బ్లాక్.. పెళ్లైన మరుసటి రోజే.. కారణమిదే...