ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షబ్నమ్.. స్వాతంత్య్రానంతరం తొలిసారి ఉరిశిక్షకు గురయ్యే మహిళ అయ్యే అవకాశం ఉంది. యూపీలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన ఆమె.. 2008లో ప్రియుడు సలీంతో కలిసి తన కుటుంబానికే చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి హతమార్చింది.
ఇదీ జరిగింది..
ఇంగ్లిష్‌లో ఎంఏ చేసిన షబ్నమ్.. ఐదో తరగతి ఫెయిలైన సలీంను ప్రేమించింది. పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరించినందున ఈ ఘాతుకానికి పాల్పడింది, చనిపోయిన వారిలో ఆమె తల్లిదండ్రులు సహా.. సోదరులు, సోదరి కూడా ఉన్నారు. ఈ కేసులో సలీం, షబ్నమ్‌లకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. సుప్రీం న్యాయస్థానం కూడా కింది కోర్టు తీర్పును సమర్థించడం వల్ల.. చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది కూడా తిరస్కరణకు గురవ్వడంతో వీరిని ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్ జల్లాదే షబ్నమ్‌నూ ఉరి తీయనున్నారు. తేదీ ఇంకా ఖరారు కాలేదు కానీ ఉరి తీసే గదిని జల్లాద్ ఇప్పటికే రెండు సార్లు పరిశీలించారు.
షబ్నమ్‌కు ముందు మహారాష్ట్రలోని అక్కాచెల్లెళ్లు సీమా గవిట్, రేణు షిండేలకు కూడా ఉరిశిక్ష పడింది. ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో వీరు నిందితులు. వీరి క్షమాభిక్షను 2014లో రాష్ట్రపతి తిరస్కరించారు. వీరికింకా ఉరిశిక్ష అమలు కాలేదు. ప్రస్తుతం యరవాడ జైలులో ఉన్నారు.
ఇదీ చదవండి: అసమ్మతి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం