దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన కేసులో నిందితుడు శంకర్ మిశ్రకు బెయిల్ లభించింది. శంకర్ మిశ్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన దిల్లీ అదనపు సెషన్సు కోర్టు.. మంగళవారం లక్ష రూపాయల బాండు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇంతకుముందు మెజిస్టీరియల్ కోర్టు శంకర్‌కు బెయిల్ నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు శంకర్ మిశ్ర.
నవంబర్ 26న న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తన తోటి ప్రయాణికురాలి(70)పై శంకర్ మిశ్ర మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. బాధిత మహిళ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసిన తర్వాత.. విషయం బహిర్గతమైంది. ఘటన జరిగిన సమయంలో ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత మహిళ ఆరోపించారు. దీంతో ఎయిరిండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్. తమ ఉద్యోగులు త్వరితగతిన స్పందించాల్సిందని అన్నారు. అయితే, తాను మహిళపై మూత్ర విసర్జన చేయలేదని నిందితుడు వాదిస్తున్నాడు. ఆ మహిళే తనకు తాను మూత్ర విసర్జన చేసుకుందని న్యాయస్థానంలో చెప్పాడు. ఆ వ్యాఖ్యలను బాధితురాలు ఖండించారు.