అన్నాడీఎంకే పగ్గాలు పూర్తిగా ఎడప్పాడి పళనిస్వామి వశమయ్యాయి. ఆయన్ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రమోట్ చేస్తూ ఆ పార్టీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. పార్టీ నాయకుడి ఎన్నిక సహా పలు అంశాలపై పార్టీ బహిష్కృత నేత పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన నిమిషాల్లోనే ఈ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న పళనిస్వామి.. అన్నాడీఎంకే దిగ్గజ నేతలైన ఎంజీ రామచంద్రన్, జయలలిత విగ్రహాలకు నివాళి అర్పించారు. తనను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
2022 జులై 11న అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశమైంది. ఈ భేటీలోనే పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పన్నీర్ సెల్వం సహా ఆయన మద్దతుదారులను బహిష్కరించారు. ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం మద్రాస్ హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ కొట్టేసింది. హైకోర్టు తీర్పు రాగానే అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉన్న పళనిస్వామి మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.
ప్రధాన కార్యదర్శి ఎన్నిక సహా అన్ని అంశాలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని అన్నాడీఎంకే న్యాయవాది ఐఎస్ ఇనబదురై వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి నిర్వహించిన ఎన్నికల ఫలితాలను బహిర్గతం చేయబోమని గతంలో కోర్టుకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అప్పుడు తీసుకున్న నిర్ణయాలు చట్టబద్ధమేనని, తీర్మానాలన్నీ చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు.
వివాదం ఇదీ..
2016లో జయలలిత మరణం తర్వాత పార్టీలో నాయకత్వ సమస్య తలెత్తకుండా ద్వంద్వ నాయకత్వ సూత్రాన్ని అమలు చేశారు. పార్టీలోని రెండు వర్గాలుగా ఉన్న పళనిస్వామి, పన్నీర్‌సెల్వం.. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ విధానాన్ని పళనిస్వామి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య అనేక విషయాల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా.. పార్టీలోని కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను రద్దు చేశారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. వెంటనే పన్నీర్ సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. కోశాధికారి పదవి నుంచి కూడా ఆయన్ను తొలగించారు. 2022 జులైలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహించారు.