Ahmedabad family murders: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవాలుగా కనిపించారు. విరాట్‌నగర్ ప్రాంతంలోని దివ్యప్రభ సొసైటీలో ఈ ఘటన జరిగింది. కుటుంబ పెద్ద వినోద్ మరాఠీ పరారీలో ఉన్నాడు. దీంతో హత్యకు అతడే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు.


వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే తన భార్యను వినోద్ చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు పిల్లలు సహా, మరో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వీరందరిదీ ఒకే కుటుంబమని తెలిపారు. అయితే, వీరిని ఎప్పుడు చంపేశారనేది తెలియలేదు. మృతదేహాల నుంచి దుర్వాసన రావడం వల్ల.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


తొలుత ఆత్మహత్య అని అనుమానించినప్పటికీ.. వినోద్ పరారీ విషయం తెలుసుకొని హత్య అని నిర్ధరణకు వచ్చినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుపై ముమ్మరంగా విచారణ జరుపుతోంది. డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ఫోరెన్సిక్ శాఖ సమన్వయంతో ఆధారాలు సేకరిస్తోంది.
ఇదీ చదవండి: దళితుడిపై దారుణం.. హింసించి.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి..