Agra Woman Protest: రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థలను బాగు చేయాలని 81రోజులుగా నిరసన చేస్తూ.. ఓ మహిళ చివరకు ప్రాణాలు విడిచారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలో జరిగింది. ఆమెతో పాటే నిరసనలో పాల్గొన్న ఓ 85 ఏళ్ల వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఆ మూడు గ్రామాల కోసం..
ఆగ్రాలోని వికాశ్నగర్కు చెందిన రాణి దేవీ(48 ).. సామాజిక కార్యకర్త సావిత్రి చాహర్ ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరులో ఆందోళనలు చేపట్టారు. ధనోలీ, అజీజ్పుర, సిరోలీ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయాలనేది వారి డిమాండ్. అక్టోబరు 13న ప్రారంభమైన రాణి దేవీ నిరసన ఇంతకాలం.. నిర్విరామంగా సాగుతూ వచ్చింది. వివిధ రకాలుగా వారు నిరసనను తెలిపారు. తమ ఇళ్లను అమ్మకానికి పెడుతున్నట్లు గోడల మీద పోస్టర్లు అంటించి ఆందోళన వ్యక్తం చేశారు.
వద్దంటున్నా..
సిరోలీ-ధనోలీ రోడ్డు మార్గంలో ఇంతకాలం నిరసన చేపట్టారు దేవీ. శనివారం రాత్రి కూడా నిరసన స్థలంలోనే ఉన్నారు. కుమారుడు నీరజ్.. వద్దని వారిస్తున్నా వినకుండా పట్టుదలతో దీక్ష కొనసాగించారు. అయితే ఆదివారం ఉదయం టీ ఇద్దామని వెళ్లిన కుమారుడు అక్కడి దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. దేవీ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి విలపించాడు. వైద్యులను సంప్రదించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు.
తన తల్లి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు నీరజ్.
85 ఏళ్ల మహిళ కూడా..
రాణితో కలిసి ఈ నిరసనలో పాల్గొన్న కృతి దేవీ అనే 85 ఏళ్ల మహిళ.. అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. కృతి దేవీని అధికారులు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం సహా ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని తెలిపారు. ధనోలీ సహా సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.43 కోట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికుల డిమాండ్ మేరకు రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: రైల్వే టికెట్ కౌంటర్పై దొంగల కన్ను- రద్దీగా ఉండే స్టేషన్లోనే చోరీ