IAF Agnipath scheme: అగ్నిపథ్ నియామక పథకానికి విశేష స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో నియామకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 94,281 దరఖాస్తులు వచ్చాయి. రిజిస్ట్రేషన్లు జులై 5 వరకు కొనసాగనున్నాయి. ఈలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం నాటికి వాయుసేన 56,960 దరఖాస్తులు స్వీకరించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ బాబు వెల్లడించారు. సోమవారం ఉదయం 10.30 గంటల నాటికి 94,281 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
జూన్ 14న ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని యువకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అనేక రైళ్లను తగలబెట్టారు. అయితే, పథకంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. వెనువెంటనే నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
Congress Agnipath scheme: మరోవైపు, ఈ పథకంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం అగ్నిపథ్ కాదని.. అంధకార పథ్ అని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ప్రధాని మోదీ తన స్నేహితులకు విమానాశ్రయాలను 50ఏళ్ల కోసం కట్టబెట్టి.. అగ్నివీరులను మాత్రం నాలుగేళ్ల కాంట్రాక్టు మీద నియమించుకుంటోందని మండిపడ్డారు. 'అగ్నివీర్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో శాంతియుత సత్యాగ్రహ దీక్షలను చేపట్టింది. 'యువతకు న్యాయం జరిగే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి' అని రాహుల్ పేర్కొన్నారు.
అగ్నివీరుల పదవీ విరమణ వయసును 65ఏళ్లకు పెంచాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. నాలుగేళ్ల సర్వీసు తర్వాత వారి భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుందని అన్నారు. '2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కొత్త రిక్రూట్మెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చారు. నాలుగు నెలలు ట్రైనింగ్ ఇచ్చి నాలుగేళ్ల కోసం నియమించుకుంటున్నారు. ఆ తర్వాత ఈ సైనికులంతా ఏం చేస్తారు? వారి భవిష్యత్ ఏమవుతుంది?' అని మమత ప్రశ్నించారు.
ఇదీ చదవండి: