నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23- 27 మధ్య వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ప్రభుత్వం తమపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని వారు ఆరోపించారు. ఆందోళనలను విస్తృతం చేసేందుకు త్వరలో ఒక వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు తెలిపారు.
ఆందోళనల్లో భాగంగా.. ఫిబ్రవరి 23న పగాడి సంభాల్ దివస్‌గా, ఫిబ్రవరి 24న 'దామన్ విరోధి దివస్'గా నిరసనలు నిర్వహిస్తామని ఎస్కేఎం నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 26న 'యువరైతు దినోత్సవం', ఫిబ్రవరి 27న 'మజ్దూర్-కిసాన్ ఏక్తా దివస్(రైతు, కార్మిక ఐక్య దినోత్సవం)గా జరుపుతామని చెప్పారు.
ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణచి వేయాలని యత్నిస్తోందని రైతు నాయకుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. సింఘు సరిహద్దులో తమ బలం పెరిగిందని, అంతర్జాతీయ సరిహద్దులా మారిందని వ్యాఖ్యానించారు. ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో 122 మంది రైతులను దిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. 33 మందికి మాత్రమే బెయిల్ దొరికిందని మరో నేత దర్శన్పాల్ తెలిపారు.
ఇదీ చదవండి:పెట్రో ధరలు తగ్గించాలని మోదీకి సోనియా లేఖ