గతేడాది గల్వాన్ లోయలో(Galwan Valley) ఘర్షణ, లద్దాఖ్‌లో ప్రతిష్టంభన తర్వాత తర్వాత పర్వత ప్రాంతంలో పోరాడేందుకు మరింత శిక్షణ, సన్నద్ధత అవసరమని చైనా సైన్యం గ్రహించిందని త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. చైనా సైనికులకు స్వల్పకాలిక పోరాటాల్లో మాత్రమే అనుభవం ఉందని.. హిమాలయ పర్వతాల్లో పోరాడే అనుభవం లేదన్నారు.
ఇదీ చదవండి: గల్వాన్ ఘటనకు ఏడాది.. పరిస్థితి మారిందా?
" గతేడాది మే-జూన్‌లో గల్వాన్ లోయ, ఇతర ప్రాంతాల్లో ఘర్షణల తర్వాత చైనా బలగాల మోహరింపులో మార్పులు వచ్చాయి. పర్వతాల్లో పోరాడేందుకు మరింత శిక్షణ, సన్నద్ధత అవసరమని వారికి అర్థమైంది. నగరాల్లో గస్తీ నిర్వహించేవారికి సైన్యంలోకి ఎక్కువగా తీసుకుంటారు. వారికి శిక్షణ సమయం కూడా తక్కువ. ఇలాంటి పర్వత ప్రాంతాల్లో పోరాటాలు చేయటం వారికి తెలియదు."
-- బిపిన్ రావత్, త్రిదళాధిపతి
ఇదీ చదవండి: చైనాకు చలి భయం- లద్దాఖ్ నుంచి రివర్స్ గేర్!
ఎప్పుడైనా సిద్ధం..
జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చాలా మంది సైనికులను చైనా కోల్పోయిందని రావత్ అన్నారు. సుశిక్షితులైన భారత సైన్యం వల్ల ఆక్రమించిన ప్రాంతాల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా కార్యకలాపాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: లద్దాఖ్ సమీపంలో మళ్లీ చైనా సైన్యం కదలికలు
మరోసారి చర్చలు..
భారత్, చైనా మరోదఫా దౌత్వపరమైన చర్చలు జూన్ 24న జరిగే అవకాశం ఉంది. ఈ చర్చల్లో ఇరు దేశాల బలగాలను వెనక్కి తీసుకురావటంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య చివరిసారిగా చర్చలు మార్చి 12న జరిగాయి.
వారితో ముప్పే..
పాకిస్థాన్ సైన్యంతో కలిసి పనిచేస్తున్న ఉగ్రవాదులు భారత్‌పై.. మరిన్ని దాడులు చేసే ప్రమాదం ఉందని త్రిదళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. ఇరు దేశాల సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
"రెండు సరిహద్దులు మనకు ప్రధానమే. 2020లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఉత్తర భాగంపై దృష్టిసారించాం. పశ్చిమ భాగంలోనూ అలాగే భద్రత కొనసాగిస్తాం. పాకిస్థాన్ సైన్యంతో కలిసి పనిచేసే కొంతమంది తీవ్రవాదులు.. భారత్‌లో విధ్వంసం సృష్టించవచ్చు. మనం అప్రమత్తంగా ఉండాలి."
-- బిపిన్ రావత్, త్రిదళాధిపతి
అక్రమంగా తరలింపు..
''వాస్తవాధీన రేఖ వెంబడి చాలా కాలంగా కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇది శుభపరిణామం. అదే సమయంలో మారణాయుధాలను, మత్తు పదార్థాలను అక్రమంగా భారత్‌లోకి తరలించటం చూస్తున్నామని'' తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల దేశ అంతర్గత శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు.
ఇదీ చదవండి: బలగాల ఉపసంహరణపై భారత్-చైనా చర్చలు