Samajwadi leader suicide: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ లభించలేదని సమాజ్‌వాదీ నేత ఆదిత్య ఠాకూర్ ఆత్మహత్యకు యత్నించారు. లఖ్‌నవూలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు.
Samajwadi ticket Leader tried to suicide
పార్టీ అభ్యర్థిత్వం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానని తెలిపారు.
"ఐదేళ్లుగా నేను కష్టపడి పనిచేశా. అలాంటిది నన్ను కాదని వేరే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు."
-ఆదిత్య ఠాకూర్, ఎస్పీ నేత
క్షణాల వ్యవధిలో ఆయన్ను పోలీసులు కాపాడగలిగారు. ఒంటిపై పోసుకున్న పెట్రోల్ కళ్లలోకి చేరడం వల్ల ఇబ్బందులు పడ్డారు ఠాకూర్.
అభ్యర్థులపై కసరత్తు...
ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 125 మందితో తొలి జాబితా ప్రకటించింది. భాజపా, సమాజ్‌వాదీ సైతం పలువురు అభ్యర్థులను ఖరారు చేశాయి.
ఇదీ చదవండి: భారత్‌లో కరోనా టీకా పంపిణీకి ఏడాది.. కీలక మైలురాళ్లు ఇవే..