Actor Navdeep Bail Petition in TS High Court : మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్(Actor Navdeep) తెలంగాణ హైకోర్టులో.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 19 వరకు అరెస్ట్ చేయవద్దని.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ పోలీసులకు.. హైకోర్టు సూచించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Tollywood Drugs Case Updates : మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు.. తీగ లాగితే డొంక కదిలినట్లుగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, బడా బాబులకు.. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియా వ్యక్తులతో సంబంధాలున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్టయిన ముగ్గురు నైజీరియన్లు సహా.. 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Madhapur Drugs Case Updates : ఈ కేసులోని రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలను పోలీసులు పేర్కొన్నారు. నటుడు నవదీప్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. అతనికి మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధం ఉన్నట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గత నెల 31న వెంకట రత్నాకర్‌రెడ్డి, బాలాజీ, మురళి ఇచ్చిన సమాచారం ఆధారంగా.. మెహదీపట్నం బస్టాప్‌లో ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల కొకైన్, 24 ఎక్టసీపిల్స్ను స్వాధీనం చేసుకున్నారు.
నైజీరియన్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే నటుడు నవదీప్‌ను కేసులో ఏ 29 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టు వివరించారు. నిందితులు తరచూ హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించే వారని రిమాండ్ రిపోర్ట్‌లో వివరించారు. విశాఖపట్నానికి చెందిన రామ్ నుంచి మాదక ద్రవ్యాలు తీసుకువచ్చి డ్రగ్స్ పార్టీలు నిర్వహించే వారని పేర్కొన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్టుతో పాటు పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నటుడు నవదీప్‌కు.. పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
TSNAB Notices to BABY Movie Producers : మరోవైపు.. బేబీ సినీమాలో డ్రగ్స్ ఏ విధంగా వినియోగించాలనే దృశ్యాలను చూపించారని సీపీ సీవీ ఆనంద్ గురువారం ఆక్షేపించారు. డ్రగ్స్ తీసుకునే దృశ్యాలను తీయవద్దని సినిమా రంగానికి సీపీ విజ్ఞప్తి చేశారు. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన చిత్ర దర్శకుడు సాయిరాజేశ్ బేబీ సినిమాలో కథలో భాగంగా డ్రగ్స్ సన్నివేశం పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
బేబీ సినిమాలో డ్రగ్స్ సన్నివేశాలకు సంబంధించిన దృశ్యాలు ఉండటంతో పోలీసులు పిలిచి వివరణ అడిగారని తెలిపారు. అలాంటి సన్నివేశాలు మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆనవాళ్లు బయటకు వచ్చాయని పోలీసులు చెప్పినట్లు సాయి రాజేశ్ వివరించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని.. తెలుగు సినీ పరిశ్రమ రంగానికి తెలపాలని పోలీసులు కోరినట్లు చెప్పారు. గురువారం రోజున తనకు అడ్వైజరీ నోటీసు కూడా ఇచ్చారని స్పష్టం చేశారు.