మహారాష్ట్ర సోలాపుర్లోని డిండిలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం కోసం పంఢర్పుర్కు భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం రాత్రి లంబోటి సమీపంలో సోలాపుర్-పుణె హైవేపై ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోలాపుర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు తుల్జాపుర్ తాలుకాలోని కడంవాడి నివాసితులుగా గుర్తించారు. భక్తులంతా ఏకాదశి సందర్భంగా ట్రాక్టర్లో పంఢరపుర్కు బయలుదేరారు. విఠలేశ్వరుడి ఆలయంలో ఏకాదశి పర్వదిన్నాన్ని నిర్వహించేందుకు సోలాపుర్ నుంచి మోహుల్ మీదుగా పంఢర్పుర్కు వెళ్తుండగా కొండి-కేగావ్ మధ్య ట్రాక్టర్ ప్రమాదానికి గురాంది. ట్రక్కు టైర్ పేలిపోయి డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్ల ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా ఢీకొట్టింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సోలాపుర్కు తరలించారు.
బొలెరోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్దానా- ఖంగావూన్-జల్నా రహదారిపై ఓ బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్లు డియోల్గావూన్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.