AAP Gujarat Office Raid : గుజరాత్ పర్యటన నిమిత్తం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు. అయితే ఆయన నగరానికి వచ్చిన కొద్ది గంటలకే అహ్మదాబాద్‌లోని ఆప్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరపడం వివాదాస్పదంగా మారింది.
అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురా ప్రాంతంలో గల పార్టీ కార్యాలయంలో స్థానిక పోలీసులు సోదాలు జరిపారని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్లో వెల్లడించింది. రెండు గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో వారికి ఏం దొరకలేదని పేర్కొంది. కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయిన కొద్ది గంటలకే ఈ సోదాలు జరిగాయి. దీంతో ఈ పరిణామాలపై దిల్లీ సీఎం ట్వీట్ చేస్తూ.. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "గుజరాత్ ప్రజల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తోన్న మద్దతును చూసి భాజపాకు మతిభ్రమిస్తోంది.. ముందు దిల్లీలో తనిఖీలు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ సోదాలు మొదలుపెట్టారు. దిల్లీ మాదిరిగానే ఇక్కడ కూడా వారికి ఏం దొరకదు. ఎందుకంటే మేం నిజాయతీ గల నాయకులం" అని రాసుకొచ్చారు.
అయితే ఈ సోదాలను గుజరాత్ పోలీసులు తోసిపుచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై నవరంగ్‌పురా పోలీసు ఇన్‌స్పెక్టర్ పీకే పటేల్ మాట్లాడుతూ.. "సోదాలపై ఆప్ నేతల ట్వీట్లు చూడగానే ఆదివారం రాత్రి నేనే స్వయంగా పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించాను. తనిఖీలు చేసేందుకు ఎవరు వచ్చారనే వివరాల గురించి అక్కడ ఉన్న నేతలను అడిగాను. కానీ ఆప్ నేతలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు" అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ నిన్న సాయంత్రం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆటోరిక్షా డ్రైవర్లు, వ్యాపారవేత్తలు, లాయర్లు, పారిశుద్ధ్య కార్మికులతో నేడు, రేపు ఆయన టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించనున్నారు.
మరోవైపు, దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు మరో సమస్యలో చిక్కుకుంది. దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కొనుగోలు చేసిన 'లోఫ్లోర్ బస్సు'ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదును సీబీఐకి పంపేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) వి.కె.సక్సేనా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపైనా ఆప్ నేతలు మండిపడ్డారు. భాజపా కావాలనే తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆప్ సర్కారు దుయ్యబట్టింది.
ఇవీ చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టు తీర్పు.. ఏం చెప్పిందంటే?
మళ్లీ పవార్‌కే పార్టీ పగ్గాలు.. అజిత్ అలక.. రంగంలోకి సుప్రియా సూలే