A Young Man Breeding Pigeons In Chhattisgarh : పక్షులపై మక్కువతో ఇంట్లోనే పావురాలను పెంచుకుంటున్నాడు ఓ యువకుడు. స్వదేశీ పావురాలతో పాటు విదేశీ జాతులను తెప్పించి పెంచుకుంటున్నాడు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన బబ్లూ. అవి ఆరోగ్యంగా ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పావురాలకు ఆహారం పెట్టిన తర్వాతే ఉదయం అల్పాహారం తీసుకుంటున్నాడు.
బబ్లూ ముందుగా స్వదేశీ పావురాలను పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత వివిధ రకాల పావురాలను పెంచాలనే ఆలోచన వచ్చింది. దీంతో విదేశాల నుంచి పావురాలను తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టాడు. బుఖారా, మసకలి వంటి జాతులతో పాటు.. ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ నుంచి తెచ్చిన పావురాలు తన దగ్గర ఉన్నాయని చెబుతున్నాడు బబ్లూ.
"ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు రకాల జాతుల పావురాలు ఉన్నాయి. వాటిలో రేసింగ్ పావురాలు కూడా ఉన్నాయి. వాటికి శిక్షణ ఇస్తే.. ఎక్కడ ఆగకుండా 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. ఎక్కడైనా వదిలేసి వస్తే అవి మనకంటే ముందుగానే ఇంటికి తిరిగి వచ్చేస్తాయి."
-బబ్లూ, పావురాల ప్రేమికుడు
పావురాలకు ఎప్పటికప్పుడు టీకాలు వేస్తూ.. అవి ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నాడు బబ్లూ. వాటి కోసం ప్రత్యేకమైన ప్రోటీన్ ఆహారాన్ని పెడుతున్నాడు. "పావురాల కోసం 12 రకాల గింజలను కలిపి వాటికి ఆహారంగా ఇస్తున్నాను. మనుషులకు రోజు ఒకటే ఆహారాన్ని పెడితే ఎలా తినలేరో.. పావురాలు కూడా అలానే.. అందుకే వివిధ రకాల గింజలను కలిపి ఆహారంగా పెడుతున్నాను." అని బబ్లూ తెలిపాడు.
ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు ఈ పావురాలను చూసుకుంటూ గడిపేస్తాడు బబ్లూ. కొన్ని జాతుల పావురాలకు తలపై జుట్టు బాగా పెరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా కత్తిరించటం, గోళ్లు తీయటం వంటివి చేస్తాడు. వాటి కోసం మూడు పంజరాలు కూడా చేయించాడు. అయితే ప్రస్తుతం చాలా రకాల పక్షులు అంతరించిపోతున్నాయని.. వాటిని రక్షించుకోవాలని అంటున్నాడు బబ్లూ. వేసవిలో పక్షులకు సరైన తిండి లభించదని.. వాటికి ఆహారం, నీరు అందించడం మన కర్తవ్యమని చెబుతున్నాడు.
Home For Birds: పక్షులకు గూళ్లు కట్టేవారున్నారు.. మీకు తెలుసా!