దేశంలో నిత్యం లక్షలాది మాస్కులు, పీపీఈ కిట్లు వ్యర్థాలుగా మారుతున్నాయి. వీటిని పునర్వినియోగానికి పనికివచ్చేలా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు కేరళకు చెందిన లక్ష్మీ మేనన్ అనే మహిళ. కొంత కాలం డిజైనర్‌గా పని చేసిన ఆమె.. గతేడాది మార్చిలో ప్యూర్ లివింగ్ అనే కంపెనీని ప్రారంభించారు. దీని ద్వారా పీపీఈ కిట్లు, చేతి గ్లౌజులు, మాస్కులు తయారు చేసే కర్మాగారాల్లో వ్యర్థాలను సేకరించటం మొదలు పెట్టారు. వాటితో దుప్పట్లు, అందంగా అల్లిన తాడులు తయారు చేస్తూ పునర్ వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్యూర్ లివింగ్ ద్వారా తయారు చేస్తున్న షయ్యా దుప్పట్లకు, అల్లిన తాడులకు మంచి ఆదరణ లభిస్తోంది. వీటిని అమ్మేందుకు ఉత్పత్తి చేయటం లేదు. పేద ప్రజలకు విరాళంగా ఇచ్చేందుకు తయారు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వేతర సంస్థలకు ఉచితంగా సరఫరా చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు లక్ష్మీ మేనన్. కేరళవ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా పీపీఈ కిట్లతో చేసిన దుప్పట్లను ఆమె పంపిణీ చేశారు. అలాగే పీపీఈ కిట్లతో దుప్పట్లు తయారు చేసే విధానాన్నిఅందరికీ అందుబాటులోకి ఉంచేందుకు దానిపై ఎలాంటి పేటెంట్‌ను లక్షీ మేనన్ తీసుకోలేదు.
పర్యావరణ హితానికే ప్రాధాన్యం...
ప్రతి ఒక్కరూ వ్యర్థాల పునర్ వినియోగానికి కృషి చేసి పర్యావరణ హితానికి పాటు పడాలనేది లక్ష్మీ ఉద్దేశం. తనకున్న పరిజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె అనేక సందర్భాల్లో తెలిపారు. కాలుష్య రహిత సమాజం కోసం లక్ష్మీ చేస్తున్న కృషిని పర్యావరణ వేత్తలు ప్రశంసిస్తున్నారు.