ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజీపై.. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటుల ఫోటోలే చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళకు వోగ్ కవర్‌పేజీపై చోటు దక్కింది. ఆమే సీతా వాసునియా.
"విషయం తెలిసిన తర్వాత చాలా సంతోషించా. మారుమూల గ్రామం నాది. అందుకే ఆ ఫ్యాషన్ మ్యాగజైన్ గురించి గానీ, దానిమీద ఏం ముద్రించారో ఏమీ తెలియదు నాకు. మేడం చెప్పారు. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై నా ఫోటో ముద్రించారని చెప్పారు. నేను కూడా దాన్ని చూశా. దీని గురించి పెద్దగా ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. డాబూ ప్రింటింగ్ పనిని కొనసాగించాలనుకుంటున్నా. నా బృందం నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. గతంలో ఇంట్లోనే ఉండేదాన్ని. ఉపాధి దొరికేది కాదు. ఇప్పుడైతే చేతినిండా పని ఉంటోంది. చాలా సంతోషం."
-సీతా వాసునియా, డాబూ ప్రింట్ కళాకారిణి
మండు ప్రాంతంలో.. స్వయంసహాయక సంఘాల మహిళలు డాబూ ప్రింట్‌తో అందమైన చీరలు రూపొందిస్తారు. ఈ చీరలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. ఈ మహిళల్లో ఒకరైన సీతా.. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు సంపాదించింది. డాబూ ప్రింట్ చీర కట్టుకున్న సీత ఫోటో.. రూప్‌మతి ప్యాలెస్ వద్ద క్లిక్ చేశారు ప్రముఖ ఫోటోగ్రాఫర్ అదితి గుప్తా. డాబూ ప్రింటింగ్ విధానంలో చీరలే కాదు.. కుర్తాలు, దుపట్టాలు, బెడ్‌షీట్లు కూడా తయారుచేస్తున్నారు మహిళలు.
"ఇది నిజంగా జరుగుతుందని మేం ఊహించలేదు. ఈ చీరలకు బ్రాండింగ్ తెప్పించేందుకు మాత్రమే మేం ప్రయత్నాలు చేశాం. ఈ కళను, చీరలను ఆధారంగా చేసుకుని, జీవితంలో ఎదుగుతారని భావించాం. ఆదివాసీ దుస్తులకు కొంచెం ఆధునికత జోడిస్తే.. తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని మా ఉద్దేశం. ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ అదితీ గుప్తా నుంచి ఓరోజు అనుకోకుండా మాకు కాల్ వచ్చింది. ఆమె జిల్లా ఏడీఎం సలోనీజీకి స్నేహితురాలు. ఈ ఫోటోను డిజిటల్ ఫోరమ్‌లో అప్‌లోడ్ చేయగా.. ఇటలీ నుంచి వోగ్ మ్యాగజైన్ సీతాను ఎంపిక చేసింది. ఇది మా జిల్లాకే గర్వకారణం."
-అలోక్ కుమార్ సింగ్, ధార్ జిల్లా కలెక్టర్
3 గ్రామాలకు చెందిన మహిళలు, యువతులకు డాబూ ప్రింటింగ్‌లో శిక్షణనిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో స్వయంసహాయక సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం దిల్లీకి చెందిన ఫోటోగ్రాఫర్ అదితీ గుప్తా నగరాన్ని సందర్శించారు. ఇక్కడ తయారుచేసిన చీరలు, కుర్తీలు, దుపట్టాలను ఫోటోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వాటిలో ఒక ఫోటో వోగ్ మ్యాగజైన్ కవర్ ఫోటోపై చోటు సాధించింది.
"ఈ చీరలను ఇక్కడి మహిళలు తయారుచేస్తారు. చేసిన పనితో పాటు వాళ్లనూ ఫోటోలు తీస్తే చాలా బాగుంటుంది. కానీ అది కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే మార్కెట్లో మోడళ్లు వేసుకున్న దుస్తులకే ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఏదైతేనేం మేమైతే మా పనిని విజయవంతంగా పూర్తి చేయగలిగాం."
-సలోనీ సిదానా, ధార్ జిల్లా ఏడీఎం
చీరలను సొంతంగా బ్రాండింగ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ మహిళలు పనిచేసే ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దేశం నలుమూలల నుంచేకాదు.. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి.
"వీళ్లకు అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా. దేశవ్యాప్తంగానే కాదు..విదేశాల నుంచీ ఆర్డర్లు తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏడాది పొడవునా పని కొనసాగించేలా ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నాం. వీరి శ్రమకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం."
-అలోక్ కుమార్ సింగ్, ధార్ జిల్లా కలెక్టర్
వివిధ ప్రాంతాల నుంచి సీతాదేవి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీతాదేవిని మెచ్చుకున్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు సీతాదేవిని అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఊపిరి ఉన్నా.. చనిపోయిందని వైద్యుల నిర్ధరణ!