హరియాణ.. కురుక్షేత్రం, మహాభారతం, శక్తిపీఠం సహా ఇతర హిందూ పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. అక్కడ షేక్ చిల్లీ సమాధి కూడా అంతే ప్రసిద్ధి చెందింది. సాధారణంగా షేక్ చిల్లీ అన్న పేరు వినగానే.. లేని పోని గొప్పలుపోయే హాస్యగాడు గుర్తుకు వస్తాడు. కానీ ఇక్కడ చెప్తున్న షేక్ చిల్లీ కథ వేరు. ఆయన అసలు పేరు షేక్ చహేలీ.
"థానేసర్‌లో ఉన్న షేక్ చిల్లీ సమాధిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమారుడు దారా శిఖో నిర్మించినట్లు చెప్తారు. షేక్ చిల్లీ అసలు పేరు షేక్ చహేలీ. ఇరాన్‌కు చెందిన సూఫీ సాధువు. భారత్ లోని సడోరా సహా వివిధ ప్రాంతాల్లో షేక్ చహేలీ నివసించినట్లు చెప్పుకుంటారు. మరణం తర్వాత దారా శిఖో ఆయనకు సమాధి నిర్మించాడట."
-రాజేందర్ రాణా, చరిత్రకారుడు
"కురుక్షేత్ర శివార్లలో షేక్ చిల్లీ సమాధి ఉంది. మొఘలుల శైలిలో నిర్మితమైన సుందర కట్టడమిది. ప్రధాన భవనం మార్బుల్ రాయితో కట్టారు. దానిపైనే గోపురం ఉంటుంది. ఉత్తర భారతంలో తాజ్ మహల్ తర్వాత షేక్ చిల్లీ సమాధికి రెండో స్థానం ఇచ్చారు. షేక్ చిల్లీ సమాధి పక్కనే ఆయన భార్య సమాధి కూడా ఉంటుంది. సాండ్‌స్టోన్‌తో కట్టిన ఈ సమాధిపై పూల డిజైన్ ఉంటుంది."
-రాజేందర్ రాణా, చరిత్రకారుడు
తాజ్‌మహల్ కడుతున్న సమయంలోనే దీన్ని కూడా నిర్మించారు. షేక్ చిల్లీ సమాధి 1650 ప్రాంతంలో నిర్మితమైంది. పూర్తిగా మొఘలుల శైలిలో నిర్మించారు. తాజ్‌మహల్‌లో ఎలా అయితే అసలైన సమాధిపై నేలపైభాగాన నమూనా సమాధులున్నాయో.. ఇక్కడ కూడా అలాంటివే రెండున్నాయి.
ఈ సమాధుల వెనక షేక్ జలాలుద్దీన్ థానేసరి సమాధి ఉంటుంది. ఆయన కురుక్షేత్రకు చెందిన గొప్ప సంతుగా చెప్తారు. మొఘల్ చక్రవర్తి హుమాయున్ తనకు పుత్రయోగం కల్పించాలని ఈ సమాధి వద్దే వేడుకోగా.. అక్బర్ జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే అక్బర్ పేరుకు ముందు జలాలుద్దీన్ జతచేశారట. షేక్ జలాలుద్దీన్ థానేసరి సమాధిని అక్బర్ తన జీవితకాలంలో రెండుసార్లు సందర్శించినట్లు చెబుతారు.
ఇదీ చూడండి: ధైర్యమే తోడుగా.. 'ఉత్తర ధ్రువం' మీదుగా!