బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా జైలులో ఒక ఖైదీ సెల్‌ఫోన్ మింగేసి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఖైదీల దగ్గర ఫోన్లు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు శనివారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో అతడు ఇలా చేశాడు. ఆదివారం ఆ వ్యక్తికి విపరీతమైన కడుపునొప్పి రావడం వల్ల ఏం జరిగిందా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతడిని జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
డ్రగ్స్ కేసులో జైలుకొచ్చి..
కైసర్ అలీ అనే వ్యక్తిని 2020 జనవరిలో మాదక ద్రవ్యాల కేసులో గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. గత మూడేళ్లుగా అతడు జైలులోనే ఉన్నాడు. ఖైదీలు సెల్ఫోన్లు వాడుతున్నారని జైలు అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అధికారులకు దొరకకూడదని అలీ తన దగ్గర ఉన్న ఫోన్‌ను మింగేశాడు. అయితే ఆదివారం అతడికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.
"ఈ సంఘటన ఎలా జరిగిందో ఆ ఖైదీ.. జైలు అధికారులకు వివరించాడు. వెంటనే అతడిని గోపాల్‌గంజ్ జిల్లా ఆస్పత్రికి తరలించాము. అక్కడ అతడికి ఎక్స్‌రే తీయగా తన కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. "
--మనోజ్ కుమార్ గోపాల్ గంజ్ జైలు సూపరిండెంట్
ఖైదీ వైద్యం కోసం ఆస్పత్రి వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు. తదుపరి చికిత్స కోసం ఖైదీని పట్నా మెడికల్ కాలేజీకి పంపారు. ఈ మెడికల్ కాలేజీ వైద్యులు సర్జరీ చేసి ఖైదీ కడుపులోని మొబైల్ ఫోన్‌ను తీయనున్నారు.
బిహార్‌లో ఖైదీలు ఫోన్లు వాడడం కొత్తేమీ కాదు. కతిహార్, బక్సర్, గోపాల్‌గంజ్, నలంద, హాజీపుర్, ఆరా, జెహనాబాద్ సహా మరికొన్ని జైళ్లలో 2021 మార్చిలో జరిగిన సోదాల్లో 35 సెల్ఫోన్లు, 7 సిమ్‌కార్డులు, 17 సెల్‌ఫోన్ ఛార్జర్లను ఖైదీల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు .